అరెస్టులపై ఎన్‌హెచ్‌ఆర్సీకి తెదేపా ఫిర్యాదు

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తెలుగుదేశం నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు

Published : 18 Jun 2020 01:06 IST

అమరావతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తెలుగుదేశం నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు, జేసీ కుటుంబ సభ్యుల అరెస్టులపై ఎమ్మెల్సీ గౌరవాణి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.

వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌ వాదాన్ని సాగిస్తోందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని  వారు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్‌పై హింస కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు విషయంలో వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ అధికారులు వ్యవహరించారని ఆక్షేపించారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్న తెదేపానేతలు.. శస్త్రచికిత్స గాయంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి దాదాపు 600 కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింపజేశారని మండిపడ్డారు. అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపించారు. వైకాపా వ్యూహాలను అనుసరిస్తూ ప్రతిపక్షాలపై కక్షసాధిస్తోందని విమర్శించారు. తమ ఒత్తిళ్లకు లొంగని పార్టీ నేతలను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా నేతలు విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని