రాహుల్‌.. చిల్లర రాజకీయాలొద్దు: అమిత్‌ షా

భారత్‌ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 20 Jun 2020 12:49 IST

దిల్లీ: భారత్‌ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో చిల్లర రాజకీయాలను విడనాడి దేశం తరఫున నిలబడాలని సూచించారు. గల్వాన్‌ ఘటనలో గాయపడిన ఓ సైనికుడి తండ్రి వ్యాఖ్యలతో ఉన్న వీడియోను అమిత్‌ షా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మన సైన్యం చాలా బలమైనది. చైనాను ఓడించగలదు. రాహుల్‌ గాంధీ ఈ విషయంలో రాజకీయాలు చేయకండి. నా కుమారుడు సైన్యంలో ఉండి పోరాడాడు. తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తాడు’’ అని ఆ జవాన్‌ తండ్రి వ్యాఖ్యలు చేశారు.

‘‘ ఓ వీర సైనికుడి తండ్రి రాహుల్‌కు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ప్రస్తుత తరుణంలో రాహుల్‌ చిల్లర రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా సంఘీభావంతో మెలగాలి’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

చైనా-భారత్‌ హద్దులోని గల్వాన్‌ లోయలో చైనా దురాగతానికి మన సైనికులు 20 మంది బలైన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  ఈ నేపథ్యంలో సరిహద్దులో చోటుచేసుకున్న పరిణామలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి సంఘీభావం తెలిపాయి. భారత భూభాగంలోకి చైనా చొరబడలేదనీ.. కన్నెత్తి చూసేందుకు ప్రయత్నించిన వారికి మన సైనికులు గుణపాఠం నేర్పారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ స్పందిస్తూ చైనా దురాక్రమణకు తలొగ్గి  ప్రధాని భారత భూభాగాన్నివారికి అప్పగించారంటూ తీవ్రస్థాయిలో ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని