
ఎవరూ చొరబడకపోతే సైనికులెలా చనిపోయారు?
ప్రధాని వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ప్రశ్నలు
దిల్లీ: భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తన విమర్శల దాడిని కొనసాగిస్తోంది. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, మన శిబిరాలు ఎవరి కబ్జాలోనూ లేవంటూ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పలు ప్రశ్నలు సంధించారు. చైనా సైనికులు చొరబడినట్టు మాజీ సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులతో పాటు శాటిలైట్ ఫొటోలు కూడా పేర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ఖండిస్తోందని ప్రశ్నించారు. అలాగే, మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని ఎందుకు అన్నారు? పీఎంవో ఈ పదాలను తన అధికారిక ప్రకటన నుంచి ఎందుకు తొలగించిందని సిబల్ అడిగారు.
మన సరిహద్దులోకి ఎవరూ చొరబడకపోతే 20మంది సైనికులు ఎలా ప్రాణాలు కోల్పోయారు? మరి 80 మంది సైనికులు ఎలా గాయపడ్డారు? 10మంది సైనికులు, అధికారులు చైనా చేతుల్లో ఎలా బందీలుగా మారారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని చేసిన ప్రకటనకు ఆయన మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. గతంలో రక్షణమంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలకు ఈ నెల 19న ప్రధాని చేసిన ప్రకటన విరుద్ధంగా ఉందని సిబల్ వ్యాఖ్యానించారు.