మోదీ ప్రభుత్వం వాటిని అన్‌లాక్‌ చేసింది

గత కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ తాజగా బుధవారం మరో మారు....

Published : 25 Jun 2020 02:41 IST

దిల్లీ: కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ తాజగా బుధవారం మరో తన మాటలకు పదునుపెట్టారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులతో సహా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మోదీ ప్రభుత్వం తాళాలు తెరిచిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ‘‘కరోనా వైరస్‌ మాత్రమే పెరగడం లేదు.. అనే పేరుతో ఒక గ్రాఫ్‌ను షేర్ చేస్తూ.. మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారితో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకూ తాళాలు తెరిచింది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. భారత్ కరోనా ప్రారంభదశలో ఉన్నప్పుడే  లాక్‌డౌన్‌ అమలు చేసిందని, అయితే వైరస్‌ తీవ్రత తగ్గుతున్న సమయంలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో కరోనా తీవ్రత పెరుగుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 15,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. నిన్న ఒక్క రోజే 465 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 2,58,685 మంది కోలుకోగా, వైరస్‌ కారణంగా 14,476 మంది మృత్యువాతపడ్డారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని