
ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి: ప్రియాంక ఫైర్
దిల్లీ: తనకు నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. తానెవరికీ భయపడనని వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తాను ఇందిరా గాంధీ మనవరాలినేనని నొక్కిచెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ బాలికల సంరక్షణ గృహంలో 57 మందికి కరోనా సోకింది. అందులో ఇద్దరు బాలికలు గర్భం దాల్చిన విషయం గురించి ప్రియాంక ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో యూపీ బాలల హక్కుల సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
‘ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. నేను వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాను. నేను ఇందిరా గాంధీ మనవరాలిని. కొన్ని ప్రతిపక్ష పార్టీల్లోని నేతల్లా అప్రకటిత భాజపా అధికార ప్రతినిధిని కాను’ అని హిందీలో ప్రియాంక ఈ రోజు ట్వీట్ చేశారు. ‘ఒక ప్రజా సేవకురాలిగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల బాధ్యత నాకుంది. వారి ముందు నిజాలను ఉంచడం నా విధి. వేర్వేరు శాఖల ద్వారా నన్ను భయపెట్టాలని యూపీ ప్రభుత్వం సమయం వృథా చేసుకుంటోంది’ అని మరో ట్వీట్లో ఆమె పేర్కొన్నారు. కాగా, సంరక్షణ గృహంలోకి రాకముందే వారు గర్భం దాల్చారని అధికారులు ఇంతకుముందే స్పష్టం చేశారు.