Updated : 27 Jun 2020 13:28 IST

నన్ను బెదిరిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

దిల్లీ: వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ఆపార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.  కేవలం తితిదే నిర్ణయాలను తప్పుబట్టినందుకు.. పార్టీని వ్యతిరేకించినట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  వైకాపా నేతల బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే  కేంద్రం నుంచి భద్రత కోరినట్టు స్పష్టం చేశారు. కరోనా పేరుతో తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉన్నందున ఇప్పట్లో నియోజకవర్గానికి వెళ్లబోనని తెలిపారు. రక్షణ కల్పించాకే నియోజకవర్గానికి వెళ్తానని స్పష్టం చేశారు.

పార్టీని, పార్టీ అధ్యక్షుడిని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇకపై కూడా వ్యతిరేకించనని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని వివరించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై స్పందించాలా? ముఖ్యమంత్రికి వివరణ  ఇవ్వాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు చెప్పారు. షోకాజ్‌ నోటీసుకు సంబంధించిన నిబంధనలు తెలుసుకునేందుకు నిన్న ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసినట్టు తెలిపారు. సీఎంను కలిసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కానీ, సీఎంను కలిసే అవకాశం లభిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.  పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తిమాట అననప్పటికీ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 
అంతకు ముందు రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. వైకాపా నేతల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నందున రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశమై తన భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. లోక్‌సభ స్పీకర్‌కు తాను రాసిన లేఖను హోంశాఖ కార్యదర్శికి పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts