ఎక్కడ ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా?

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని... హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 29 Jun 2020 01:41 IST

కరోనా నిధుల లెక్క్లలు అడిగిన డీకే అరుణ

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని... హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఆమె ఎండగట్టారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకొని తెరాస చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు బలవుతున్నారని ఆమె దుయ్యబట్టారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో భాజపాపై విమర్శలు చేస్తూ కేసీఆర్‌ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. 

‘‘కరోనా కేసుల సంఖ్యల విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న వివరాలకు, జిల్లా వైద్యాధికారులు చెబుతున్న లెక్కలకు తేడాలున్నాయి. కరోనా పరీక్షలు చేసే ల్యాబుల్లో సౌకర్యాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో జాప్యం చేస్తోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం మెప్పు కోసం హడావుడి చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలు కాపాడటంలో ఎందుకు లేదు’’ అని డీకే అరుణ ప్రశ్నించారు 

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కరోనా నిధులు రూ.7,151 కోట్లతోపాటు... ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో చెప్పే నిజాయతీ కేసీఆర్‌కు ఉందా అని డీకే అరుణ ప్రశ్నించారు. కరోనా నివారణకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్‌ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. హరితహారం పేరుతో ఊరూరా తిరుగుతున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లోని ఆసుపత్రులను సందర్శించి సౌకర్యాలపై ఆరా తీసే బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో ఖర్చయ్యే కరోనా చికిత్స ఖర్చును పేదలు ఎలా భరిస్తారు అని డీకే అరుణ ప్రశ్నించారు. ఇప్పటికైనా కరోనా పరీక్షల సంఖ్యను పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని డీకే అరుణ కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని