ఆ అంశంలో మా మద్దతు భాజపాకే: మాయావతి

చైనాతో వివాదం అంశంలో భాజపాకు మద్దతుగా ఉంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌-భాజపా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని హితవు పలికారు.......

Published : 29 Jun 2020 15:20 IST

దిల్లీ: చైనాతో వివాదం అంశంలో భాజపాకు మద్దతుగా ఉంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌-భాజపా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలతో ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని.. వీటిపై రాజకీయాలు తగవని హితవు పలికారు. అంతర్గత విభేదాలను చైనా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘర్షణల పేరిట దేశంలో ఇతర సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశ పౌరులు ఎంతో నష్టపోతున్నారన్నారు. 

ఈ సందర్భంగా మాయావతి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బలహీన వర్గాల సంక్షేమం కోసమే బీఎస్పీ ఏర్పడిందన్నారు. తాము పార్టీ స్థాపించిన నాడు కాంగ్రెస్‌ అధికారంలో ఉందని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ అండగా ఉండి ఉంటే బీఎస్పీ ఏర్పాటయ్యేదే కాదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే అనేక మంది ప్రజలు ఉపాధి కోసం వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ఆరోపించారు. వారికి ఉపాధి మార్గాలు చూపించి ఉంటే నేడు వలస కూలీల సమస్య తలెత్తేదే కాదన్నారు. 

కాంగ్రెస్‌ తప్పిదాల నుంచి భాజపా పాఠాలు నేర్చుకోవాలని మాయావతి హితవు పలికారు. భారత్‌ను స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రచారాలకే పరిమితమైతే సరిపోదంటూ చురకలంటించారు. పెట్రో ధరల పెంపును కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొవిడ్‌తో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది మరో సమస్యగా పరిణమించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని