సీఎం జగన్‌కు నాపై కోపం ఉందనుకోను!

ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ కాకరేపుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వైకాపాలో జరుగుతున్న తాజా పరిణామాలపై అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Jun 2020 01:16 IST

వైకాపాలో ఏం జరుగుతోంది?

 ఎంపీ రఘురామకృష్ణ రాజుతో ‘ఈటీవీ’ ఇంటర్వ్యూ

హైదరాబాద్‌: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ కాకరేపుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వైకాపాలో జరుగుతున్న తాజా పరిణామాలపై అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షోకాజ్‌ నోటీసు, సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడం, దిల్లీలో విందు రాజకీయం తదితర అంశాలపై తన అంతరంగాన్ని ‘ఈటీవీ’తో ముఖాముఖిలో ఆవిష్కరించారు.

రెండు, మూడు నిర్ణయాలతో విబేధించా.. 

‘‘నేను ఎప్పుడూ మా పార్టీని కించపరిచేలా మాట్లాడలేదు. ప్రభుత్వం తీసుకున్న రెండు, మూడు నిర్ణయాల పట్ల మాత్రమే విబేధించాను. అందులో ఒకటి పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసివేయడం. ఈ అంశాన్ని పార్లమెంటులో వ్యతిరేకించాను. దాని గురించి మా నాయకుడు, ముఖ్యమంత్రి జగన్‌కు వివరణ కూడా ఇచ్చాను. మరో అంశం తితిదే భూములు విక్రయించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని  వ్యతిరేకించడం. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా ఆ చర్యను ఖండించాను. అలా మాట్లాడినందుకే మా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. మరి తితిదే భూముల అమ్మకాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు కూడా షోకాజ్ నోటీస్‌ ఇస్తారా?’’ అని ప్రశ్నించారు.

ఆ స్పష్టత కోసమే సీఈసీని ఆశ్రయించా
‘‘ఒక నిజాయతీగల రాజకీయ నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా ఉన్న నా ఉనికిని ప్రశ్నిస్తేనే, విజయసాయిరెడ్డి నాకు ఏ హోదాలో షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారో అని ప్రశ్నించా. ఎందుకంటే పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు‌, రాజ్యసభ సభ్యుడు అంటూ విజయసాయికి సుమారు పది పదవులు ఉన్నాయి. అందునా షోకాజ్‌ నోటీసు వచ్చింది వైఎస్సాఆర్‌ సీపీ అనే లెటర్‌హెడ్‌పై.. కానీ నాకు బీఫారం ఇచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అనే లెటర్‌హెడ్‌పై. అందుకే ఈ విషయంపై స్పష్టత కోసమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించా. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే దాడి చేస్తాం అని కొందరు బహిరంగంగానే నన్ను బెదిరిస్తున్నారు. అందుకే  భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖను కోరా. ఇందుకు కారణం ఆంధ్ర రాష్ట్ర పోలీస్‌శాఖపై నాకు నమ్మకం లేకపోవడమే’’ అన్నారు. 

షోకాజ్‌ నోటీసు నేరుగా నాకు అందలేదు

పార్టీ రాజ్యాంగాన్నే ఫాలో కావాలి తప్ప.. దేశ రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఒప్పుకోం అనే తరహాలో తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారన్నారు. ఆ షోకాజ్‌ నోటీసు కూడా నేరుగా తనకు అందలేదనీ.. ఓ మీడియా సంస్థ ద్వారా వచ్చిందని తెలిపారు.ఇంతవరకు సీఎం జగన్‌కు తనపై కోపం ఉందని తాను అనుకోవడంలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్‌కు రాసిన లేఖ ద్వారా గత కొన్ని రోజులుగా పార్టీకి, రఘురామకృష్ణరాజుకు మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైకాపాలో అసలు ఏం జరుగుతోంది? పార్టీతో ఆయనకు విభేదాలు ఎక్కడ వచ్చాయి? తదితర అనేక అంశాలు రఘురామ కృష్ణరాజు మాటల్లోనే.. (వీడియో చూడండి)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని