ఇవాళ తెలంగాణ చరిత్రలో బ్లాక్‌డే : ఉత్తమ్‌

ఇవాళ  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 07 Jul 2020 15:51 IST

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం నాలుగు కోట్ల  మంది ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. కానీ ఇవాళ న్యాయవ్యవస్థపై కూడా ప్రజల అసంతృప్తితో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపే కూల్చివేత పనులు పూర్తి చేయాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌ నివాసం వద్ద కాంగ్రెస్‌ నేతలు మీడియాతో మాట్లాడారు. 

‘తెలంగాణ చరిత్రలో ఇవాళ ఒక బ్లాక్ డే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు. కానీ రూ.500 కోట్లతో సచివాలయం నిర్మాణం అవసరమా?. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కేసీఆర్‌కు తొత్తుగా మారారు. 20 మంది సీనియర్‌లను తొక్కి సీఎస్‌గా పదవి పొందారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అర్హుడు కాదు. గవర్నర్ పిలిస్తే పోకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం ఎక్కడికి పోయారు. ప్రభుత్వం చూపించే లెక్కలకు క్షేత్ర స్థాయిలో లెక్కలకు చాలా తేడా ఉంది. కేసీఆర్ చీకటి కుట్రలో పాల్గొన్న ఉన్నతాధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమం చేస్తుంది. పక్క రాష్ట్రంలో సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు.  ఏపీలో 10 లక్షల పరీక్షలు చేస్తే తెలంగాణలో లక్ష టెస్టులా?’ అని ఉత్తమ్‌ మండిపడ్డారు.

హెల్త్‌ ఎమర్జెన్నీ ప్రకటించాలి..

‘గవర్నర్ విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలి. హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన చేయాలి. ప్రజల స్పందన మేరకు సీఎస్‌ని గవర్నర్ పిలుస్తే వెళ్లకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించారు. హైదరాబాద్‌లో కరోనా మృతదేహాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్ధరాత్రి సెక్రటేరియట్ కూల్చాల్సిన అవసరం ఏమిటి?.  విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలని గవర్నర్ కి లేఖ రాస్తాం’ 

షబ్బీర్ అలీ

వాస్తు పిచ్చితో కేసీఆర్‌ పాలన చేస్తున్నారు..

‘సీఎం కేసీఆర్ క్వారంటైన్‌లో ఉన్నారు. పాలన ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. సీఎం లేకపోవడంతో గవర్నర్ రివ్యూ చేద్దాం.. అంటే సీఎస్ తో పాటు అధికారులెవ్వరూ స్పందించకపోవడం బాధాకరం. కరోనాతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే... సీఎం సెక్రటేరియట్‌పై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు పిచ్చితో పాలన చేస్తున్నారు. కావాలంటే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్త సచివాలయం కట్టుకోవాలి. ఉన్నదాన్ని ఎందుకు కూల్చడం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉంది. దీంతో ఆగమేఘాలపై కూల్చుతున్నారు’

- జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ

గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించాలి

‘అర్ధరాత్రి సచివాలయాన్ని ఎందుకు కూల్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి?. ఒక్క ఏడాదిలోనే కొత్త సచివాలయం నిర్మాణం జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ కరోనా విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోరు?. గచ్చిబౌలి టీమ్స్ హాస్పిటల్‌లో సదుపాయాలు ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలి. కరోనా రోగులు సమస్యలపై సెల్ఫీ వీడియోలు పెట్టినా ప్రభుత్వంలో చలనం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వేలాది సంఖ్యలో కేసులు వస్తుంటే మూడు నెలల కాలం వృథా చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, కరోనాను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించాలి

శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని