గన్నవరం... గరం గరం

గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు చినఆవుటపల్లి వేదికయ్యింది.

Published : 05 Sep 2020 07:33 IST

వైకాపా వర్గాల ఘర్షణ

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు చినఆవుటపల్లి వేదికయ్యింది. యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్‌ మేనల్లుడు పెదఆవుటపల్లి పరిధిలో ఒక చెరువును లీజుకు తీసుకున్నారు. అందులోని నీరు వృథా కాకుండా పొలంలోని గడ్డి సాగుకు మళ్లించారు. ఈ విషయమై వినయ్‌, అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వంశీ అనుచరుడు గోగులమూడి దుర్గారావు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు ఆత్కూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. విషయం తెలుసుకున్న కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు స్టేషన్‌ వద్దకు వచ్చారు. తన వర్గీయులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌ను కోరగా మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్‌ పక్కనే జాతీయ రహదారి ఉండటం, భారీగా జనం రావడంతో గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వివాదం విషయం తెలిసి వైకాపా సీనియర్‌ నాయకుడు దుట్టా రామచంద్రరావు స్టేషన్‌కు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దుట్టా మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి చినఆవుటపల్లిలో మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే వంశీ పాల్గొన్న కార్యక్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చురుగ్గా వ్యవహిరించారని ఆ ఉద్యోగి బంధువు పంచాయతీ బరిలో ఉన్నారని చెబుతున్నారు. దీనిపై మాలమహానాడు నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక వినయ్‌ వర్గం ఉందన్న అనుమానం నేపథ్యంలో ఘర్షణకు బీజం పడిందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని