తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగసభలో

Updated : 13 Apr 2021 10:00 IST

నిరసనగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగసభలో దుండగులు రాళ్లు విసిరారు. కృష్ణాపురం కూడలిలో జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం దిగి రోడ్డుపై కాసేపు బైఠాయించారు. గాయపడిన కార్యకర్తలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నశించాలన్నారు. ఆందోళనకు దిగిన తెదేపా అధినేత వద్దకు అదనపు ఎస్పీ మునిరామయ్య వచ్చి మాట్లాడారు. నిరసన విరమించాలని కోరారు.

ఎస్పీ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు

అనంతరం అనిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణాపురం కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లకుండా ఆపేయడంతో రోడ్డుపైనే ఆయన నిలబడ్డారు. దీంతో అదనపు ఎస్పీ సుప్రజ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడారు. అనంతరం ఎస్పీకి ఆయన వినతిపత్రం అందజేశారు.

రాళ్లదాడి రాజకీయ కుట్రే: చంద్రబాబు

తమ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చట్టం కొందరికి చుట్టమైతే పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు. కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని.. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రేపు తమ ఎంపీలు దిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ఉద్యోగులంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలన్నారు. వైకాపా రౌడీయిజానికి భయపడేది లేదని చెప్పారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని