Covid: ఎన్నికల్లో కరోనా ప్రసారం

సుదీర్ఘంగా కొనసాగిన ఎన్నికల ప్రచారం, భారీఎత్తున జన సమీకరణలతో పశ్చిమ బెంగాల్‌లో

Updated : 17 May 2021 13:50 IST

గ్రామీణ బెంగాల్‌లో 48 రెట్లు పెరిగిన క్రియాశీలక కేసులు 
 ఆజ్యం పోసిన సుదీర్ఘ ప్రచారం.. బహిరంగ సభలు 

కోల్‌కతా: సుదీర్ఘంగా కొనసాగిన ఎన్నికల ప్రచారం, భారీఎత్తున జన సమీకరణలతో పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు తామర తంపరగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రత అమాంతం ఎగబాకడానికి ఇదే కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నదీ తీర ప్రాంత గ్రామాల్లో కొవిడ్‌-19 క్రియాశీలక కేసులు ఏకంగా 48 రెట్లు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 26న ఎన్నికల తేదీలను ప్రకటించేనాటికి రాష్ట్రంలో క్రియాశీలక కేసులు 3,343 ఉండేవి. శనివారం నాటికి అది 1.32 లక్షలకు చేరింది. అంటే రమారమి 40 రెట్లు తేడా. కోల్‌కతా మినహా ఇతర జిల్లాలను పరిశీలిస్తే వ్యాప్తి ఇంకా ఎక్కువ. వాటిలో 2,183 క్రియాశీలక కేసులు అప్పుడు ఉంటే ఇప్పుడు 1.06 లక్షలకు పెరిగాయి. అంటే దాదాపు 48 రెట్లు ఎక్కువ. కోల్‌కతా మినహా బెంగాల్‌లోని ఇతర జిల్లాల్లో ఫిబ్రవరి 26న 4.45 లక్షల కేసులు ఉంటే ఇప్పుడు 8.64 లక్షలకు చేరాయి. ఈ పరిస్థితికి కేవలం ఎన్నికల ప్రచారాలే కారణమని వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ అమితవ నంది ఓ వార్తాసంస్థకు చెప్పారు. ఎన్నికల వల్లే బి.1.618 రకం వైరస్‌ బెంగాల్‌లో వ్యాప్తి చెందిందని తెలిపారు. హుగ్లీ, తూర్పు బర్ధమాన్, పశ్చిమ మేడినిపుర్, తూర్పు మేడినిపుర్, నదియా, దార్జీలింగ్, ముర్షీదాబాద్‌ వంటి జిల్లాల్లో రెండు నెలల్లోపే కేసులు 100 రెట్లు పెరిగిపోయాయి. ఇవన్నీ రాజకీయంగా గట్టి పోటాపోటీ వాతావరణం ఉన్న జిల్లాలు. దీంతో నేతలంతా సుడిగాలి పర్యటనలు జరిపారు. వాటికి ప్రజలు భారీగా హాజరయ్యారు. 

కేంద్ర బలగాలకు పరీక్షలేవీ?

బెంగాల్‌లో ఎన్నికలను అశాస్త్రీయంగా ఎనిమిది దశల్లో నిర్వహించడంపై సామాజిక వైద్య నిపుణుడు డాక్టర్‌ సంజీవ్‌ బంధోపాధ్యాయ విస్మయం వ్యక్తంచేశారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని ఇప్పుడు వలస కార్మికులపై ఆంక్షలు విధించి, ఎన్నికల సమయంలో ఎలాంటి పరీక్షలు లేకుండా పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలను మారుమూల ప్రాంతాలకు పంపడమేమిటని ప్రశ్నించారు. కేసులు పెరగడానికి అదే ప్రధాన కారణమైందన్నారు. పరిస్థితిపై తాము చేసిన హెచ్చరికల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని ‘వైద్యుల సంయుక్త వేదిక’కు చెందిన డాక్టర్‌ హిరాలాల్‌ కొనార్‌ చెప్పారు. కరోనాను జయించేశామన్న తీరులో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యనూ తగ్గించేశారని, పరీక్షా సదుపాయాలను పెంచలేదని తప్పుపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని