ఏపీలో అలాంటి ప్యాకేజీ లేదు: కనకమేడల

కరోనా, కొవిడ్‌ బాధిత కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ఆరోపించారు. తిరుపతి రుయా

Published : 21 Jul 2021 01:05 IST

దిల్లీ: కరోనా, కొవిడ్‌ బాధిత కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ఆరోపించారు. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనలో మరణాలు తక్కువ చేసి చూపించి రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసిందన్నారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఒక్కరోజే 31 మంది చనిపోతే.. కేవలం 11 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలో కొవిడ్ మృతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని.. ఏపీలో అలాంటి ప్యాకేజీ ఏదీ లేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని.. వీటిపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. మూడోదశ కరోనా హెచ్చరికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కనకమేడల కోరారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని, నూరు శాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నాన్‌ స్ట్రాటజీ సెక్టార్‌ సంస్థల ప్రైవేటీకరణ లేదా మూసివేత ఉంటుందని వెల్లడించారు. ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చినందున ఇకపై చెప్పేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు, వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

నెరవేర్చాలా? లేదా?: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

విభజన చట్టంలోని అంశాలన్నింటినీ నెరవేర్చారా? లేదా? అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ని లోక్‌సభలో ప్రశ్నించారు. అమలు చేయకుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇప్పటివరకు చాలా అమలు చేశాం. మరికొన్ని అమలు దశలో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పనకు పదేళ్ల సమయం ఉంది. ఏపీ విభజన చట్టం అంశాల అమలు పురోగతిపై అప్పుడప్పుడు సమీక్షిస్తున్నాం. ఇప్పటివరకు 25 సార్లు సమీక్ష సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నాం’’ అని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని