Bhawanipur Bypoll: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో

Published : 14 Sep 2021 11:31 IST

 భవానీపుర్‌లో మమతపై యువ న్యాయవాది పోటీ

నామినేషన్ల సమర్పణ పూర్తి  ః ఓట్లు నిలుపుకోవడంపైనే భాజపా దృష్టి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 30న జరిగే భవానీపుర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించడం అందుకు తొలిమెట్టు అవుతుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన మమత ఈసారి భవానీపుర్‌ నుంచి విజయ గర్జన చేసి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఆమె సంకల్పం నెరవేరడం అసాధ్యమేమీ కాదు. ‘దెబ్బతిన్న పులి’ని అని చెప్పుకొంటున్న మమతపై పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్‌ బిశ్వాస్‌ కానీ దీదీకి దీటైనవారు కాదు. భాజపా అభ్యర్థి ఖాతాలో ఇంతవరకు రాజకీయ విజయాలేవీ లేవు. అయితే ఆమె ‘భయమెరుగని మహిళ’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ అసలు పోటీచేయడమే లేదు. అన్నట్టు మమత, ప్రియాంక, శ్రీజీవ్‌ ముగ్గురూ న్యాయవాదులే. మమత ప్రస్తుతం ప్రాక్టీస్‌ చేయకపోయినా, ఆమె హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో ఇప్పటికీ సభ్యురాలే. భాజపా అభ్యర్థి ప్రియాంక అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితుల పక్షాన హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లభించిన 35 శాతం ఓట్లను నిలబెట్టుకోవడానికే భాజపా పోటీ చేస్తోంది. సీపీఎం అభ్యర్థి బిశ్వాస్‌ భవానీపూర్‌ వాస్తవ్యుడు. ఎన్నికలకు కొత్త. 34 ఏళ్లపాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. దీన్నిబట్టి ఉపఎన్నికలో బిశ్వాస్‌ విజయావకాశాలు ఏపాటివో అంచనా వేసుకోవచ్చు.

మినీ భారతం భవానీపుర్‌

భవానీపుర్‌ వాస్తవ్యురాలైన మమత ఆ నియోజకవర్గం నుంచి 2011, 2016లలో ఎన్నికయ్యారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారు మొదటి నుంచీ తృణమూల్‌ కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు. గుజరాతీలు, సిక్కులు, బిహారీల జనాభా కూడా అధికమే. ఈ మినీ భారతంలో తృణమూల్‌ వరుస విజయాలు సాధిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఈమధ్య అక్కడ బలం పెంచుకొంటోంది. కానీ, దిల్లీలో రైతు ఉద్యమం వల్ల సిక్కు, పంజాబీ ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యారు. ఈ ఉపఎన్నికలో పోటీకి కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉండటం తృణమూల్‌కు లాభిస్తుంది. ఈ రెండు పార్టీల ఐక్యత జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఆవిర్భావానికి దోహదం చేస్తుందని అంచనా.

మమత ప్రచారం

సోమవారం మమత ఆకస్మికంగా సోలా అణా మసీదు, ఇతర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. తన ఇంటికి వెళ్తున్న సమయంలో మరికొన్ని వార్డుల్లో తిరిగారు. మరోవైపు ఈ ఉప ఎన్నిక నిర్వహణను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీని విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 

ప్రియాంక టిబ్రేవాల్‌ నామినేషన్‌

నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం భాజపా అభ్యర్థిగా ప్రియాంక టిబ్రేవాల్‌ నామపత్రాలు సమర్పించారు. ఆమె వెంట ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర నేతలు ఉన్నారు.  1981లో కోల్‌కతాలో జన్మించిన ప్రియాంక కోల్‌కతా విశ్వవిద్యాలయం పరిధిలోని హజ్రా లా కళాశాల నుంచి న్యాయ విద్య పట్టా అందుకున్నారు. థాయిలాండ్‌లోని అసంప్సన్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఎంపీ బాబుల్‌ సుప్రియో సూచనలతో 2014లో భాజపాలో చేరారు. 2015లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో 58వ వార్డు నుంచి పోటీ చేసి తృణమూల్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2020లో బెంగాల్‌ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. నిరాడంబరంగా వచ్చి సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్‌ కూడా నామపత్రాలు సమర్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు