Congress: ‘చేయి’ కాల్చుకోవడం ఎందుకని..
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్‌లో చెలరేగిన దుమారంతో
పంజాబ్ వ్యవహారంతో ఆత్మరక్షణలో కాంగ్రెస్
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ప్రయోగాల జోలికి పోకూడదని నిర్ణయం
ఈనాడు, దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్‌లో చెలరేగిన దుమారంతో ఆ పార్టీ ఆగ్రనాయకత్వం ఆత్మరక్షణలో పడింది. దీనిపై ‘జి-23’గా పేరు పొందిన సీనియర్ నేతలు తీవ్ర స్వరం వినిపించడంతో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో చేపట్టదలచుకున్న ప్రయోగాలను అటకెక్కించేసింది.
పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన వివాదంతో.. ‘జి-23’ నేతలకు కొత్త ఆయుధం లభించినట్లయింది. ఈ వర్గంలోని సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీ అధినాయకత్వంపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తగా.. ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. దీన్ని ‘జి-23’ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సమన్వయం అంతంతమాత్రంగానే ఉంది.
నిజానికి పంజాబ్ వ్యవహారంలో రాహుల్ గాంధీ, ప్రియాంకలు అంతా తామై నడిపించారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు.. సిద్ధూ కాంగ్రెస్ పంచన చేరేలా ప్రియాంక కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ ఏడాది జులైలో ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇందుకు రాహుల్ ఆమోద ముద్ర వేశారు.
మాకూ అదే కావాలి..
సోనియాకు వీర విధేయుడైన అమరీందర్ సింగ్ ఆకాంక్షలకు విరుద్ధంగా పంజాబ్ పీసీసీ పీఠాన్ని సిద్ధూకు అప్పగించడంలో రాహుల్, ప్రియాంకలు విజయం సాధించడంతో.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ శాఖల్లో లుకలుకలు మొదలయ్యాయి. అక్కడి ప్రస్తుత ముఖ్యమంత్రుల వ్యతిరేక వర్గాలు.. తమ రాష్ట్రాల్లోనూ ‘గాంధీ’ల నుంచి ఇదే తరహా జోక్యాన్ని కోరుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం.. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్, టి.ఎస్.సింగ్ దేవ్‌లు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని రాహుల్ గాంధీ రాజీ సూత్రాన్ని తెచ్చినట్లు దేవ్ అనుచరులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో బఘేల్ రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నప్పటి నుంచి.. నాయకత్వంలో మార్పు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే కుర్చీ పంపకంపై ఎలాంటి అవగాహన కుదరలేదని బఘేల్ వర్గం గట్టిగా వాదిస్తోంది. సిద్ధూకు పంజాబ్ పీసీసీ పీఠాన్ని కట్టబెట్టాక.. బఘేల్‌ను పదవి నుంచి తప్పించడంలో రాహుల్ నుంచి ఇదే తరహా చొరవను సింగ్ దేవ్ శిబిరం ఆశిస్తోంది.
రాజస్థాన్‌లోనూ ఇదే తరహా సాహసోపేత ప్రయోగాన్ని సచిన్ పైలట్ వర్గం కోరుకుంటోంది. సచిన్.. రాహుల్‌కు అత్యంత సన్నిహితుడు. గత ఏడాది ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రస్తుత సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆయనను రాజస్థాన్ పీసీసీ పీఠం, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. నాడు పైలట్‌కు, ఆయన అనుచరులకు ప్రభుత్వం, పార్టీలో గౌరవప్రదమైన స్థానాలు కల్పిస్తామని రాహుల్, ప్రియాంకలు హామీ ఇచ్చారు. గహ్లోత్ మాత్రం సచిన్ పైలట్‌తో రాజీకి విముఖంగా ఉన్నారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పదవుల్లో పైలట్ విధేయులకు ఆదరణ కరవైంది.
ఇప్పుడొద్దు
అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం, జి-23 నేతల దూకుడుతో గాంధీ కుటుంబం కలతకు గురైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రయోగాలకు ఇది సమయం కాదని, అలాంటి ప్రతిపాదనలను వాయిదా వేసుకోవాలని సోనియా గాంధీ.. రాహుల్, ప్రియాంకలకు సూచించినట్లు సమాచారం. దీనికితోడు అమరీందర్ సింగ్ తరహా పరిస్థితిని తాను ఎదుర్కోవడం లేదని గహ్లోత్.. అధినాయకత్వానికి సంకేతాలిచ్చారు. రాష్ట్రంలోని మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడటం కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. గత నెల 29న గోవాలో పార్టీ నేత లూయిజిన్హో ఫెలెయిరో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మేఘాలయ మాజీ సీఎం, ప్రస్తుత విపక్ష నేత కూడా హస్తం పార్టీకి త్వరలోనే గుడ్‌బై చెప్పి, తృణమూల్ చేరే అవకాశం కనిపిస్తోంది. అమరీందర్ కూడా పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
-
India News
భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే
-
Ts-top-news News
Eamcet: ఈసారీ ‘స్లైడింగ్’ పెత్తనం కళాశాలలదేనా?
-
Crime News
Crime News: వృద్ధుణ్ని చంపి.. దేహాన్ని ముక్కలు చేసి.. యువజంట కిరాతకం
-
Ts-top-news News
Sangareddy: కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు
-
Sports News
MS Dhoni: ధోని ఓ ఇంద్రజాలికుడు