Prashant Kishor: కాంగ్రెస్‌లో పీకే చేరికపై అనిశ్చితి

 ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌లో చేరే విషయంలో అనిశ్చితి నెలకొంది.

Published : 21 Oct 2021 11:37 IST

విధాన నిర్ణయాల్లో ఆయన జోక్యానికి నేతల విముఖత 
అందుకే తృణమూల్‌ వైపు చూపు 

ఈనాడు, దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌లో చేరే విషయంలో అనిశ్చితి నెలకొంది. దివంగత సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మాదిరిగా అధ్యక్షురాలికి రాజకీయ కార్యదర్శి హోదాలో  తాను ఉండాలని పీకే కోరుకుంటున్నారు. విధాన నిర్ణయాల యంత్రాంగంలో ఆయన జోక్యం చేసుకోవడానికి పార్టీలో ఎక్కువమంది నేతలు ఇష్టపడడం లేదు. తాను అనుకున్నది జరగకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై పీకే దృష్టి సారించారు.

ఒక్కసారిగా పెరిగిన స్థాయి 
పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాక ప్రశాంత్‌ కిశోర్‌ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్‌ షా వంటి వ్యూహకర్తలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయన అవసరం ఉందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో జులైలో కిశోర్‌ భేటీ అయ్యారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వర్చువల్‌గా దానిలో పాల్గొన్నారు. పంజాబ్, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సలహాదారునిగా వ్యవహరించిన ఆయన ఇక ఆ పార్టీలో లాంఛనంగా చేరబోతున్నారనే అభిప్రాయం నెలకొంది. మే 2న బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కిశోర్‌ స్పందిస్తూ తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమేనని స్పష్టమయింది. దానిమీద ప్రియాంక గాంధీ, ఎ.కె.ఆంటోనీ, కె.సి.వేణుగోపాల్, అంబికా సోని తమ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరప్పమొయిలీ వంటి కొందరు నేతలు ఆయన రాకను ఆహ్వానించారు. హరీశ్‌ రావత్‌ సహా అనేకమంది ఇతర నేతలు మాత్రం.. ఎన్నికల వ్యూహకర్త పాత్రను ఎన్నికల వరకే పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. పార్టీ విధానాల్లో కూడా జోక్యం చేసుకునే అధికారాన్ని కల్పిస్తామని అగ్రనేతలు హామీ ఇచ్చి, ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని పీకే సొంత సంస్థ ‘ఐ-ప్యాక్‌’ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌తో వ్యవహారం బెడిసి కొట్టాక ఐ-ప్యాక్‌లో కిశోర్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మమతా బెనర్జీ ఆ సంస్థతో తమ పార్టీకి ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల కాలానికి పునరుద్ధరించుకున్నారు. భవానీపుర్‌ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకుని, టీఎంసీ విజయానికి కిశోర్‌ పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని