Published : 06 Nov 2021 11:29 IST

UP Elections: అటు వరుణ్‌.. ఇటు ప్రియాంక

యోగి సర్కారుపై అక్కాతమ్ముళ్ల విమర్శల దాడి
కాంగ్రెస్‌ గూటికి మేనకా గాంధీ తనయుడు?

లఖ్‌నవూ: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ యూపీ సర్కారును లక్ష్యంగా చేసుకుని భాజపాపై విమర్శల దాడికి దిగుతుంటే... మరోవైపు ఆమె సోదరుడు, భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ సొంత పార్టీ తీరును ఎండగడుతున్నారు. దీంతో వీరిద్దరూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కొరకరాని కొయ్యలా మారారు. ప్రియాంక చిన్నమ్మ మేనకాగాంధీ కుమారుడైన వరుణ్‌... పీలీభీత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దికాలంగా ఆయన సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ప్రియాంక కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ, కాం గ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నిం పుతూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుణ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరతారని, ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఊపందుకొంది.

తల్లిని తప్పించినందుకే?

భాజపా తనను నిర్లక్ష్యం చేస్తోందన్న భావనతో వరుణ్‌ గాంధీ ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. తన తల్లి మేనకా గాంధీని పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడం ఆయన్ను మరింత బాధపెట్టినట్టు చెబుతున్నారు. అక్టోబరు 3న భాజపాకు చెందిన కేంద్ర సహాయమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడి కాన్వాయ్‌... లఖింపుర్‌ ఖేరీలో రైతులపైకి దూసుకెళ్లింది. అనంతరం హింస చోటుచేసుకుంది. ఈ ఘటనల్లో మొత్తం 8 మంది మృతిచెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక, వరుణ్‌లు డిమాండ్‌ చేశారు. రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వాయ్‌ దూసుకెళ్లిన వీడియోలను తమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులకు వరుణ్‌ మద్దతు ప్రకటించారు. చెరకు కనీస మద్దతు ధరను యోగి ప్రభుత్వం రూ.250 నుంచి రూ.350కి పెంచగా, దాన్ని రూ.400 చేయాలని వరుణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆయన కోరినట్టే ప్రతిపక్షాలు కూడా చెరకు కనీస మద్దతు ధరను రూ.400కు పెంచాలని డిమాండ్‌ చేశాయి. ఇలాంటి పోకడతో యోగికి వరుణ్‌ పెద్ద తలనొప్పిలా మారారు.

పాత విషయాలను మర్చిపోయి...

ప్రియాంకకు సోదరుడు వరుణ్‌తో ఉన్న అనుబంధం, ఆయనపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నట్టు గాంధీ కుటుంబ వర్గాలు తెలిపాయి. పాత విషయాలన్నీ మరచిపోయి, వరుణ్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ఆమె కోరుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ‘వరుణ్‌ దారితప్పాడు. ఆయనకు ఓటు వేయవద్దు’ అని గతంలో ప్రియాంక వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో- వరుణ్‌ త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి చేరతారని, అక్కతో ఆయన మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, అక్కాతమ్ముళ్లు కలిసి యోగి సర్కారుకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే అవకాశం ఉంటుందని, ఈ పరిణామం ఎన్నికల ముందు భాజపాకు ప్రతికూలంగా మారుతుందని భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని