Published : 28/11/2021 14:07 IST

కాంగ్రెస్‌కు సవాలుగా తృణమూల్‌ ఆ పార్టీ నేతలపై వల

జాతీయ నాయకత్వంపై మమత దృష్టి

కోల్‌కతా: మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఒకప్పటి తన మాతృ సంస్థ కాంగ్రెస్‌ నుంచి నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఆ జాతీయ పార్టీని బలహీనపరచడం ప్రతిపక్ష ఐక్యతకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత ఆగస్టులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహించిన ప్రతిపక్ష సమావేశంలో టీఎంసీ, కాంగ్రెస్‌ల మధ్య స్నేహసౌహార్దాలు వెల్లివిరిసినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అవుతోంది. కాంగ్రెస్‌కు సంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల్లో కూడా తృణమూల్‌ విస్తరించడం దీనికి ప్రధాన కారణం. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విసిరిన తీవ్రమైన సవాల్‌ను సైతం అధిగమించి ఘన విజయం సాధించినప్పటి నుంచి మమతలో ఆత్మ విశ్వాసం పెరిగింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని చేపట్టే సత్తా కాంగ్రెస్‌కు కాకుండా తనకే ఉందని ఆమె నమ్ముతున్నట్లుంది. అయితే ఇది కాంగ్రెస్‌ను బలహీనపరచి భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని బెంగాలీ నేత, లోక్‌ సభలో కాంగ్రెస్‌ నాయకుడైన అధీర్‌ చౌధరి హెచ్చరించారు. దీనితో తృణమూల్‌ ఏకీభవించడం లేదు. ‘‘గత ఏడేళ్లలో భారతీయ జనతా పార్టీతో పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. భాజపాను గట్టిగా ఎదిరించినది తృణమూల్‌ మాత్రమే. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్ష సంఘటనను నిర్మించాలని మేము ఎన్నడూ భావించలేదు. కానీ, పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోతోంది’’ అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ అన్నారు. అందుకే కాంగ్రెస్‌ ఏమైపోయినా సరే తాను దేశమంతటా విస్తరించాలని టీఎంసీ నిశ్చయించింది. అందుకే పలువురు కాంగ్రెస్‌ నాయకులను చేర్చుకుంటోంది.

సొంత అస్తిత్వం కోసం ఆరాటం

బెంగాల్‌లో తృణమూల్, మహారాష్ట్రలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి) కాంగ్రెస్‌ నుంచి వేరుపడిన పార్టీలు. తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవడానికి, తమకు తాముగా ఎదగడానికి అవి కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడం సహజం. అదే సమయంలో అవి భాజపాతో తలపడతాయి కూడా. కాంగ్రెస్‌ బలహీనపడిన కొద్దీ అవి జాతీయ పార్టీలుగా ఎదగడానికి ప్రయత్నిస్తాయని రాజకీయ విశ్లేషకుడు మైదుల్‌ ఇస్లాం అన్నారు.  అయితే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ప్రతిపక్ష అనైక్యత భాజపాకు లబ్ధి చేకూర్చవచ్చని మరో విశ్లేషకుడు బిశ్వనాథ్‌ చక్రవర్తి హెచ్చరించారు. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాలు లోక్‌సభలో మెజారిటీ సీట్లు సాధించడం అసాధ్యమని అన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా కాంగ్రెస్‌ లేకుంటే అవి సమైక్యంగా నిలవలేవని హెచ్చరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఎన్ని పొరపొచ్చాలు ఉన్నా, సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. అలానే టీఎంసీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా లోక్‌సభ ఎన్నికలకు ముందో, తరవాతో అవి చేతులు కలపక తప్పదని రాజకీయ విశ్లేషకుడు సుమన్‌ భట్టాచార్య వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని