
‘డీప్ ఫ్రీజర్’లో కాంగ్రెస్!విపక్షాల చూపు మమత వైపే: తృణమూల్
కోల్‌కతా: కాంగ్రెస్‌పై తాజాగా మరోసారి టీఎంసీ మాటల తూటాలు పేల్చింది. ఆ పార్టీ పస అయిపోయిందని.. ఇక ‘డీప్ ఫ్రీజర్’లోకి వెళ్లిపోయిందంటూ శుక్రవారం దుయ్యబట్టింది. దీంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు విపక్షాలన్నీ ఇప్పుడు తమ అధినాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీవైపే చూస్తున్నాయని పేర్కొంది. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సొంత పత్రిక ‘జాగో బంగ్లా’లో రాసిన ప్రత్యేక వ్యాసంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది. భాజపాతో పోరుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. తాజాగా కాంగ్రెస్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఉటంకించింది. ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని పేర్కొంది. ‘‘కాంగ్రెస్ పూర్తిగా శక్తియుక్తులు కోల్పోయిన పార్టీ అని టీఎంసీ చాలాకాలంగా చెబుతూ వస్తోంది. భాజపాపై పోరాడాలన్న ఉత్సాహం వాళ్లకు లేదు. అంతర్గతపోరుతో ఆ పార్టీ లోతుకు కూరుకుపోయింది. దీంతో ప్రతిపక్షాన్ని నిర్మించడానికి ఆ పార్టీకి శక్తిగానీ, సమయంగానీ లేదు. యూపీఏ మనుగడలో ఉండదు’’ అని తృణమూల్ విమర్శించింది.
ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరం..
దేశానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరమని, ప్రతిపక్షాలన్నీ ఆ బాధ్యతను మమతకు అప్పగించాయని.. దేశంలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతిపక్ష నేత మమతేనని టీఎంసీ పేర్కొంది.