Shiv Sena: యూపీఏలోకి శివసేన.. మహారాష్ట్ర వెలుపలా కాంగ్రెస్‌తో పొత్తు

ఐక్య ప్రగతిశీల కూట మి(యూపీఏ) ఎక్కడుందీ అంటూ  టీఎంసీ అధ్యక్షురాలు ప్రశ్నించడంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌....

Updated : 08 Dec 2021 11:37 IST

దిల్లీ: ఐక్య ప్రగతిశీల కూట మి(యూపీఏ) ఎక్కడుందీ అంటూ  టీఎంసీ అధ్యక్షురాలు ప్రశ్నించడంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌...తన నేతృత్వంలోని కూటమిలోకి శివసేనను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. శివసైనికులతో పొత్తును మహారాష్ట్రకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ ముఖ్య నేతలు  మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో తమకు మద్దతిస్తూ ప్రకటన చేయాలని శివసేనను కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అయిదు రాష్ట్రాల్లో శివసేనకు సొంత బలం పెద్దగా లేకున్నప్పటికీ హిందుత్వ భావజాల పార్టీ కనుక రాజకీయంగా ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది. అంతేగాకుండా, తరచూ హిందూవ్యతిరేక ముద్ర వేస్తూ భాజపా చేస్తున్న దాడి నుంచి రక్షణకు ఇది ఉపకరిస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ కారణాల రీత్యా.. తమ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరాల్సిందిగా శివసేనను ఒప్పించేందుకు వారు యత్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో శివసేనను పోటీకి దింపి, పొత్తు కుదుర్చుకునే ఆలోచనలోనూ ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ప్రధాన విపక్ష స్థానం నుంచి తొలగించాలన్న టీఎంసీ వ్యూహాన్ని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ‘కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేయాలని ఫాసిస్టు భాజపా కోరుకుంటోంది. భాజపాను వ్యతిరేకించే పార్టీలు కూడా కాంగ్రెస్‌ మనుగడ లేకుండా చేయాలనుకోవడం తీవ్ర ప్రమాదకరం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏను సోనియా,రాహుల్‌ బలోపేతం చేయాల’ని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఈ నెల 5వ తేదీ సంపాదకీయంలో పేర్కొనడం గమనార్హం. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మంగళవారం రాహుల్‌ గాంధీని కలిసిన అనంతరం చేసిన వ్యాఖ్యలు తాజా పరిణామాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని