UP: యూపీలో కీలక పరిణామం.. బాబాయి, అబ్బాయి పొత్తు ఖరారు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌..

Published : 17 Dec 2021 10:44 IST

శివపాల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన అఖిలేశ్‌ 

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. తన బాబాయి, ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లి రాజకీయ చర్చలు జరిపారు. వీరి భేటీ సుమారు 45 నిమిషాలపాటు సాగింది. అనంతరం అఖిలేశ్‌ ట్వీట్‌ చేస్తూ..‘రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యింద’ని తెలిపారు. శివపాల్‌యాదవ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ఆ ట్వీట్‌కు జత చేశారు. అయితే, ఎవరికి ఎన్ని సీట్లనే విషయం తెలియరాలేదు. చర్చల్లో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ కూడా పాల్గొన్నారని సమాచారం.

శివపాల్‌యాదవ్‌ చాలా కాలంగా సమాజ్‌వాదీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. సీట్ల కేటాయింపుపై ఇంతకాలం మిన్నకుండిపోయిన అఖిలేశ్‌ ఆకస్మికంగా గురువారం శివపాల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం పొత్తులకే పరిమితం కాకుండా రెండు పార్టీల విలీనం అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ఘోర పరాజయం తరువాత సమాజ్‌వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చిన శివపాల్‌యాదవ్‌ సొంతంగా ప్రగతిశీల సమాజ్‌వాది పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. బాబాయి, అబ్బాయిల పొత్తు భాజపా విజయాన్ని అడ్డుకోలేదని, 300లకు పైగా స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత, ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని