Shiv sena: సంజ్ఞలతో మోదీని అనుకరించిన శివసేన ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ శివసేన ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ సంజ్ఞలు చేయడం మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీవ్ర దుమారానికి ..

Published : 23 Dec 2021 10:57 IST

ప్రధానిని ఎగతాళి చేశారంటూ భాజపా నేతల ధ్వజం
మహారాష్ట్ర అసెంబ్లీలో దుమారం.. క్షమాపణలు చెప్పిన శాసనసభ్యుడు

ముంబయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ శివసేన ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ సంజ్ఞలు చేయడం మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఆయన చేష్టలు ప్రధానిని ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ సహా భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలు స్తంభించడంతో.. చివరకు జాదవ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విద్యుత్తు సంబంధిత అంశాల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సభలో కమలదళ సభ్యులు తొలుత విమర్శలు గుప్పించారు. దానిపై విద్యుత్తు శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ స్పందిస్తూ.. ప్రధాని మోదీ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో మోదీని అనుకరిస్తూ జాదవ్‌ చేతి సంజ్ఞలు చేశారు. ఫలితంగా సభలో పెద్ద దుమారం చెలరేగింది. ప్రధానిని ఎమ్మెల్యే అవమానించారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమయ్యాక జాదవ్‌ మాట్లాడుతూ.. తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పినవాటి గురించే మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలు, సంజ్ఞలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే.. వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

ఠాక్రే ఆరోగ్యంపై ప్రధాని ఆరా
ఇటీవలే వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ బుధవారం ఆరా తీశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయా పార్టీల సభాపక్ష నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న మోదీ.. ఠాక్రే ఆరోగ్యం గురించి శివసేన నేతలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కోలుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారని శివసేననేత వినాయక్‌ రౌత్‌ ప్రధానికి తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని