చండీగఢ్‌ మేయర్‌ పదవి భాజపా కైవసం

 భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలతో చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో

Published : 09 Jan 2022 10:50 IST

సీనియర్‌ డిప్యూటీ, డిప్యూటీ మేయర్‌ పదవులూ ఆ పార్టీకే

చండీగఢ్‌: భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలతో చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో అన్ని పదవులను సొంతం చేసుకుంది. నగర మేయర్‌గా ఆ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌ సరబ్‌జిత్‌ కౌర్‌ ఎన్నికయ్యారు. సీనియర్‌ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులూ కమలనాథులకే దక్కాయి. ఈ ఫలితాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ‘ప్రజాస్వామ్య హత్య’గా అభివర్ణించింది. డిసెంబరు 27న వెలువడిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లో మొత్తం 35 వార్డులకు గాను ఆప్‌-14, భాజపా-12, కాంగ్రెస్‌-8, శిరోమణి అకాలీదళ్‌-ఒక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఒకరు భాజపాలో చేరారు. ఛండీగఢ్‌ ఎంపీ(భాజపా)కి ఎక్స్‌ఆఫీసియో సభ్యుడిగా మేయర్‌ ఎన్నికల్లో ఓటు హక్కు లభించింది. శనివారం నిర్వహించిన మేయర్‌ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని సరబ్‌జిత్‌ కౌర్‌...ఆప్‌ అభ్యర్థిని అంజు కత్యాల్‌ను ఒక్క ఓటు తేడాతో ఓడించారు.

మొత్తం 36 ఓట్లలో 28 పోలయ్యాయి. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఏడుగురు, శిరోమణి అకాలీదళ్‌కు ఉన్న ఒక్క కౌన్సిలరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భాజపా మేయర్‌ అభ్యర్థినికి 14 ఓట్లు, ఆప్‌ అభ్యర్థినికి 13 ఓట్లు వచ్చాయి. ఆప్‌ కౌన్సిలర్‌ ఓటు ఒకటి చెల్లదని ప్రకటించారు. సీనియర్‌ డిప్యూటీ మేయర్‌గా భాజపా కౌన్సిలర్‌ దలిప్‌ శర్మ(15) రెండు ఓట్ల తేడాతో ఆప్‌ కౌన్సిలర్‌ ప్రేమ్‌ లత(13)పై గెలుపొందారు. ఆప్‌ కౌన్సిలర్‌ ఒకరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో భాజపా అభ్యర్థి అరుణ్‌ గుప్తా, ఆప్‌ అభ్యర్థి రాంచందర్‌ యాదవ్‌కు సమానంగా చెరి 14 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయడంతో అరుణ్‌ గుప్తా గెలుపొందారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా కాంగ్రెస్‌ కౌన్సిలర్లు భాజపాతో కుమ్మక్కయ్యారని ఆప్‌ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్‌ ఓటును భాజపా కుట్ర పూరితంగా రద్దు చేసిందని దుయ్యబట్టారు. మేయర్‌ ఎన్నికలపై న్యాయపోరాటం చేయనున్నట్లు ఆప్‌ నాయకులు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని