Rahul Gandhi: మోదీ వెనుక అదృశ్యశక్తులు: రాహుల్‌

ప్రయోగాలు చేయడానికి పంజాబ్‌ ఒక రసాయన ప్రయోగశాల కాదనీ, సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితుల్ని అర్థం చేసుకుని శాంతిని కొనసాగించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని...

Published : 16 Feb 2022 11:03 IST

అపర కుబేరుల కోసమే ప్రధాని నిర్ణయాలు

చండీగఢ్‌: ప్రయోగాలు చేయడానికి పంజాబ్‌ ఒక రసాయన ప్రయోగశాల కాదనీ, సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితుల్ని అర్థం చేసుకుని శాంతిని కొనసాగించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. నేతల చర్యలు ఆధారంగా ఏయే అదృశ్య శక్తులు తెరవెనుక పనిచేస్తున్నాయనేది ఓటర్లు చూడాలని పిలుపునిచ్చారు. మంగళవారం పంజాబ్‌లోని రాజ్‌పురలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీ, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌లపై మాటలతో విరుచుకుపడ్డారు. ‘..ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండని కోరుతున్నవారు పంజాబ్‌ను నాశనం చేస్తారు. రాష్ట్రం తగులబడిపోతుంది. నా మాటలు గుర్తుపెట్టుకోండి. 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎదురుగా కనిపించే ముఖాలను కాకుండా నేతలను ఎవరు నడిపిస్తున్నారనేది చూడాలి. మోదీ పాలనలో పేదలు అవస్థలు పడుతున్నారు. ఆయన వెనుక అదృశ్య శక్తులున్నాయి. ఆయన తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. దీనిదృష్ట్యా మోదీ వెనుక ఉన్నదెవరో గ్రహించండి. దేశంలోని ముగ్గురు నలుగురు కుబేరులు కలిసి రైతుల్ని దోచుకోవాలనుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, నూతన వ్యవసాయ చట్టాలు వంటివన్నీ వారి కోసమే’ అని ఆరోపించారు.

ఎస్పీ గెలిస్తే ఐదేళ్లు రేషన్‌ ఉచితం: అఖిలేశ్‌
రాయ్‌బరేలీ (యూపీ): ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తే ఐదేళ్లపాటు పేదలకు రేషన్‌ సరకులతో పాటు కిలో చొప్పున నెయ్యి కూడా ఉచితంగా అందిస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. ఉచిత రేషన్‌ పథకానికి భాజపా మంగళం పాడబోతోందని, ఎన్నికల వరకే ఇది కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాలతో పాటు ఆవనూనె, ఏటా రెండు వంటగ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

గోవాలో మా కూటమికి 19 సీట్లు: తృణమూల్‌
పణజీ: గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గానూ తాము కనీసం 12 చోట్ల, మిత్రపక్షమైన మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) ఏడు చోట్ల గెలవబోతున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. అధికార భాజపాకు గట్టి పోటీని ఇచ్చింది తామేనని టీఎంసీ గోవా అధ్యక్షుడు కిరణ్‌ కందోల్కర్‌ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆధిక్యాని కంటే కొద్దిగా సీట్లు తగ్గినా, సభలో విశ్వాసం రుజువు చేసుకుంటామన్నారు. ఫలితాల తర్వాత కూడా ఎంజీపీ తమతోనే ఉంటుందని, తాము గోవాను విడిచిపోబోమని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని