KTR: 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే: కేటీఆర్‌

గోదావరి నదీ జలాలను ఒడిసి పట్టి జిల్లాలను సస్యశ్యామలం చేశామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు...

Published : 16 Feb 2022 14:17 IST

వర్ని: గోదావరి నదీ జలాలను ఒడిసి పట్టి జిల్లాలను సస్యశ్యామలం చేశామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో రాష్ట్రంలోని 46వేల చెరువులకు జీవం పోశామని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందనే వాళ్లకు అభివృద్ధితో సమాధానం చెప్పామని కేటీఆర్‌ అన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. గతంలో సాగుకు 6 గంటల విద్యుత్‌ మాత్రమే ఇచ్చేవారని.. అది కూడా విడతల వారీగా రెండేసి గంటల చొప్పున ఇచ్చేవాళ్లని గుర్తుచేశారు. 

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి నిత్యవిద్యార్థి అని.. బాన్సువాడ ప్రాంత సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఆయనకు ఉందని కేటీఆర్‌ కొనియాడారు. పర్యాటకంగానూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.300 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేశామని.. ప్రతి మండలంలో ఓ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ బాన్సువాడ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆ నిధులతో పట్టణం రూపురేఖలే మారిపోయాయన్నారు. పోచారం సూచన మేరకు బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

సభ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్పీకర్‌ పోచారం, మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. రక్తదానం చేసిన వారిని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని