Andhra News: వైకాపాలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం.. జగన్‌తో పిన్నెల్లి భేటీ

ఏపీలో మంత్రి పదవులు దక్కని అసంతృప్తులకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మంత్రులు, వైకాపా ముఖ్యులు ఆయా నేతలకు నచ్చజెపుతున్నారు.

Updated : 12 Apr 2022 14:13 IST

అమరావతి: ఏపీలో మంత్రి పదవులు దక్కని అసంతృప్తులకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మంత్రులు, వైకాపా ముఖ్యులు ఆయా నేతలకు నచ్చజెపుతున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. పిన్నెల్లితో మాట్లాడాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్‌ సూచించారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలను పిన్నెల్లికి వివరించాలని పెద్దిరెడ్డికి జగన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో పెద్దిరెడ్డితో పిన్నెల్లి భేటీ అయ్యారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సీఎం వద్దకు పెద్దిరెడ్డి తీసుకెళ్లారు. మంత్రివర్గంలోకి తీసుకోలేకపోవడానికి గల కారణాలను పిన్నెల్లికి జగన్‌ వివరించినట్లు సమాచారం. 

మరోవైపు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణ భేటీ అయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి గల కారణాలను ఆయన వివరించినట్లు తెలిసింది. అయితే సీఎం నుంచి హామీ వస్తేనే సంతృప్తిగా ఉంటానని సామినేని ఉదయభాను స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన జగన్‌ను కలవనున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసినట్లు ప్రకటించిన హోంశాఖ మాజీ మంత్రి సుచరితతోనూ పార్టీ ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. ఆమె ఇప్పటికే సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతోనూ వైకాపా ముఖ్యులు చర్చిస్తూ అలక వీడేలా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని