బాంచెన్‌ బతుకులు వద్దు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాంచెను బతుకులు బతకొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పాదయాత్ర కొనసాగించారు.

Updated : 16 Aug 2022 06:39 IST

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌


నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతున్న బండి సంజయ్‌

ఈనాడు, వరంగల్‌, దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాంచెను బతుకులు బతకొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పాదయాత్ర కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రశాంతి విద్యానికేతన్‌లో జెండా ఎగురవేసి విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదవాలని సూచించారు. దేవరుప్పుల చౌరస్తాలో, స్వరాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.  నిజాం పాలన, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పేదలు కోల్పోతే అధికారం మాత్రం దొరల చేతుల్లోకి వెళ్లిందన్నారు. రాక్షస, సెంటిమెంట్ల పాలనతో రాజకీయ లబ్ధి పొందుతున్న పార్టీలను ప్రజలు గుర్తించాలన్నారు.

చిన్నారిని పలకరిస్తూ..

పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

ధర్మాపురంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను   బండి సంజయ్‌ పరిశీలించారు. యాత్రలో వృద్ధులను పలకరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర్మాపురంలో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెల్లడిస్తూ, ఒకవేళ ఇవి తప్పయితే తనపై  కేసు పెట్టాలని సవాలు విసిరారు.  అనంతరం ధర్మాపురానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్‌ ఇంటిని సందర్శించారు. టానునాయక్‌ తమ్ముడు దర్గ్యా నాయక్‌, కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. టాను నాయక్‌ కుటుంబ సభ్యులందరికి భాజపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ యాత్ర ఇన్‌ఛార్జి లేగ రాంమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, హనుమకొండ అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధులు రాణి రుద్రమ, సంగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, విద్యాసాగర్‌ రెడ్డి, ఉడుగుల రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్‌ యాదవ్‌, చౌడ రమేష్‌, కర్ర శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రాజశేఖర్‌ రెడ్డి, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

రాత్రి 9.30 గంటలకు పాలకుర్తి మండలం విస్నూరుకు చేరిన  పాదయాత్ర

యాత్ర కొనసాగిన గ్రామాలు..

మొదటి రోజు యాత్ర 15 కిలోమీటర్లు కొనసాగింది.  దేవరుప్పుల, కొత్తవాడ, ధర్మాపురం, పాలకుర్తి మండలం మైలారం, విస్నురు గ్రామాల గుండా రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర సాగింది.


ఆందోళనలతో అట్టుడికింది..

ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రోజే ఆందోళనలతో అట్టుడికింది. యాత్ర మొదలవుతుండగానే భాజపా, తెరాస వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొనడంతో పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. ఉన్నపళంగా ఇరు వర్గాల మధ్య తోపులాటలు, దాడులు జరగడంతో దేవురుప్పుల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గంటకుపైగా ఈ గొడవలు కొనసాగాయి. బండి సంజయ్‌, భాజపా నాయకులపై జరిగిన దాడిని 13 బీసీ సంఘాల తీవ్రంగా ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని