TDP: సుప్రీం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వారి భూముల విలువ పడిపోతుందనే రాజధాని డ్రామా

రాజధాని అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలను వక్రీకరించి వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.

Updated : 30 Nov 2022 11:10 IST

వైకాపా నేతలపై మాజీ మంత్రి బండారు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాజధాని అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలను వక్రీకరించి వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు విధించిన గడువు తేదీలపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, దీన్ని ప్రభుత్వానికి అనుకూలమని ఏవిధంగా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నించారు. విశాఖలో అధికార పార్టీ నేతల గుప్పిట్లో వందల ఎకరాల భూములున్నాయని, వాటి విలువ పడిపోకుండా ఉండేందుకే రాజధాని డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కోర్టు మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడిందా. రాజధానిని మార్చాలంటే పార్లమెంట్‌కు వెళ్లాలనే చర్చ వచ్చింది కదా. ఆ విషయంపై సజ్జల, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజలను మభ్యపెట్టే దిశగా అందరూ ప్రచారం చేస్తున్నారు. నిజంగా  వారికి అనుకూలంగా కోర్టు మాట్లాడితే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. మీ న్యాయవాది హైకోర్టును కర్నూల్‌లో పెట్టడం లేదని, అమరావతిలోనే ఉంటుందని చెప్పారు. మరి ఎలా కర్నూల్‌లో మహార్యాలీ చేస్తామంటున్నారు. హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది, మీరు ఎప్పుడు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేశారు, ఎందుకంత ఆలస్యం చేశారో ప్రజలకు చెప్పగలరా’ అని బండారు ప్రశ్నించారు.

సునీతకు భద్రత కల్పించాలి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె సునీత పోరాడుతున్న తీరు అభినందనీయమని బండారు పేర్కొన్నారు. అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం నుంచి తన తండ్రి కేసును బదిలీ చేయాలని కోరడం జగన్‌మోహన్‌రెడ్డికి సిగ్గుచేటన్నారు. ఎంపీ సీటు కోసమే తమ బాబాయిని హత్యచేశారని సొంత చెల్లెలు షర్మిల ఆరోపించిన విషయం మరచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో దోషులందరినీ కడప నుంచి హైదరాబాద్‌ జైల్‌కు తరలించాలన్నారు. బాబాయి కేసులో దోషులను పట్టుకోలేని నాయకుడు చెల్లెలు సునీతకు ఏం రక్షణ కల్పిస్తాడన్నారు. వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని