Chandrababu - Pawan Kalyan: ఎమర్జెన్సీ కంటే దారుణం

ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులున్నాయని, ప్రజా జీవనం అంధకారంలో ఉందని, వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.

Updated : 09 Jan 2023 07:11 IST

ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు
అది చీకటి జీవో..
ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం
తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రకటన
కుప్పంలో బాబు పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించిన పవన్‌
చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం
3 గంటల పాటు చర్చలు
ఈనాడు - హైదరాబాద్‌


కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుతోపాటు రాష్ట్రంలో వైకాపా అరాచకాలపై చర్చించేందుకే భేటీ అయ్యాం. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తిపట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గం. ఆయనకు నా సంఘీభావం తెలిపా.

పవన్‌ కల్యాణ్‌


నాకు సంఘీభావం తెలిపిన పవన్‌కు కృతజ్ఞతలు. వైకాపా అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. సభలకు బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది కాదా? పవన్‌ కల్యాణ్‌ యాత్రలు చేయకూడదు, లోకేశ్‌ పాదయాత్ర చేపట్టకూడదనేది వైకాపా ఆలోచన.

చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులున్నాయని, ప్రజా జీవనం అంధకారంలో ఉందని, వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వైకాపా ఓడిపోతుందని తెలిసే ప్రతిపక్ష నేతలను ప్రజల వద్దకు వెళ్లకుండా చేసే కుట్రలో భాగంగానే చీకటి జీవోను తెచ్చారని విమర్శించారు. జగన్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్య పోరాటం చేస్తామని, అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి వరకూ అందరి దృష్టికీ తీసుకెళ్తామని తెలిపారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడితో పవన్‌ కల్యాణ్‌ ఆదివారం భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌.. 3 గంటలపాటు ఆయనతో వివిధ అంశాలపై చర్చించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్‌ తప్పుబట్టారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తనలాగే పవన్‌నూ వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

బాబు పట్ల వైకాపా దుర్మార్గవైఖరి: పవన్‌

‘కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో వైకాపా అరాచకాలపై చర్చించేందుకే భేటీ అయ్యాం. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తిపట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గం. ఆయనకు నా సంఘీభావం తెలిపా. జీవో 1తో ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాలపై చర్చించాం. వైకాపా ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తోంది. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం సరికాదు. పింఛన్లను ఇష్టానుసారం తొలగిస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం లేదు. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వడం లేదు. విశాఖలో నాపై ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబును అడ్డుకుంటున్నారు. ఫ్లెక్సీలు నిషేధించామంటున్నా.. జగన్‌ పుట్టిన రోజుకు అన్ని చోట్లా ఫ్లెక్సీలు పెడతారు. కరోనా సమయంలో అందరికీ ఆంక్షలు పెట్టారు. వైకాపా నేతలమో నిబంధనలను పాటించలేదు. ఇప్పుడు జీవో 1 అంతే. ఈ నిబంధనలన్నీ ప్రతిపక్షాలకే తప్ప అధికారపక్షానికి వర్తించవని తెలుస్తూనే ఉంది. సభలు జరుగుతుంటే శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. పోలీసులు బందోబస్తు ఇవ్వకపోతే ఏమనాలి? వారి బదులు మేం లాఠీలు పట్టుకోవాలా? కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక కోడికత్తి డ్రామాల పార్టీయే ఉందన్న అనుమానం కలుగుతోంది. వైకాపా సంక్షేమ పథకాలు బాగుంటే.. గుంటూరులో సంక్రాంతి కానుక కోసం అంతమంది ఎందుకు వచ్చారనేదీ చూడాలి. వైకాపా అరాచకాలపై మా మిత్రపక్షమైన భాజపాతోనూ చర్చిస్తాం. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వం. నాపై విమర్శలు చేస్తున్న వైకాపా వారివి పాచినోళ్లు. నేను అడుగు తీసి అడుగేస్తే వాళ్లకు ఇబ్బంది. ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా ఒకే గళం వినిపించాలనేది మా ఆలోచన. ఏపీ అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించే బాధ్యత తీసుకుంటాం. నాపై వైకాపావారు చేసే విమర్శలకు ఈ నెల 12న సమాధానమిస్తా’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

పరాకాష్ఠకు చేరిన వైకాపా అరాచకాలు: చంద్రబాబు

‘నాకు సంఘీభావం తెలిపిన పవన్‌కు కృతజ్ఞతలు. వైకాపా అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. జీవో 1 తీసుకొచ్చి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? 2019 తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు, విశాఖ, తిరుపతి పర్యటనలకు వెళ్లినప్పుడు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినప్పుడు వైకాపా కార్యకర్తలు దాడులు చేస్తే వాటిని డీజీపీ నాడు సమర్థించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ప్రశ్నిస్తే మా పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పార్టీలకు రాజకీయ విధానాలుంటాయి. కానీ వైకాపాకు రౌడీయిజం, గూండాయిజమే ఉన్నాయి. జీవో 1 అనే చీకటి జీవో తెచ్చి ఆంక్షలు పెట్టారు. ఇప్పటంలో పవన్‌ సభకు స్థలమిచ్చిన వారి ఇళ్లను కూల్చేశారు. నా సొంత నియోజకవర్గం కుప్పం వెళ్తే అడ్డుకున్నారు. నా పర్యటనలో పాల్గొన్నందుకు కుప్పంలో 74 మందిపై కేసులు పెట్టారు. చివరికి మహిళలపైనా హత్యాయత్నం కేసులు పెట్టారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో జగన్‌ సభలు పెట్టి సొల్లు కబుర్లు చెబుతున్నారు. వైకాపా సమావేశాలకు అనుమతులు అక్కర్లేదుగానీ, ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు తీసుకోవాలంటున్నారు.

ప్రభుత్వ కుట్ర వల్లే కందుకూరు, గుంటూరు ఘటనలు

కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. సభలకు ప్రజలు వస్తున్నప్పుడు బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది కాదా? పవన్‌ కల్యాణ్‌ యాత్రలు చేయకూడదు. లోకేశ్‌ పాదయాత్ర చేపట్టకూడదనేది వైకాపా ఆలోచన. నేతలను వ్యక్తిగతంగా దూషించడమే రాజకీయమా? కుప్పంలో నన్ను వెనక్కి పంపాలని చూసినా నేను తగ్గలేదు. నేను నిలదీస్తే పోలీసులు సమాధానం చెప్పలేదు. మంత్రి బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ప్రతిపక్షాల సమావేశాలకు అనుమతులు, స్థలాలు ఎందుకు ఇవ్వరో చెప్పాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీడియా, ప్రజా సంఘాలు సహా అందరూ కలిసి రావాలి. మీడియాకు రాసే స్వేచ్ఛ, రాజకీయ పార్టీలకు తిరిగే స్వేచ్ఛ ఉంటేనే ప్రజల మనుగడ అని అంతా గుర్తించాలి. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతాం. ఏపీ అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తాం. రాష్ట్రంలో ప్రజా జీవితం అంధకారమైంది. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైంది. ఇక అన్నిరకాల పోరాటాలూ చేస్తాం. అన్ని పార్టీలూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్‌, రాష్ట్రపతి. కేంద్రం జోక్యం చేసుకోవాలి’ అని చంద్రబాబు కోరారు.


సాదరంగా స్వాగతం.. వీడ్కోలు

తొలిసారి తన నివాసానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు ఎదురేగి స్వాగతించి తీసుకెళ్లారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. భేటీ ముగిశాక వెళ్లేటప్పుడు పవన్‌ వెంట బయటకు వచ్చి వీడ్కోలు పలికారు.


పొత్తులపై తర్వాత చర్చిస్తాం: చంద్రబాబు

‘రాజకీయాల్లో పొత్తులు సహజం.. సమీకరణాలను బట్టి పొత్తులుంటాయి. 2009లో భారాసతో (నాటి తెరాస) పొత్తు పెట్టుకున్నాం. 2014లో విభేదించాం. పొత్తులపై తర్వాత చర్చిస్తాం. ఎప్పుడు ఏం చేయాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మా వ్యూహాలు మాకుంటాయి’ అని చంద్రబాబు తెలిపారు.


భారాస రావడంలో తప్పు లేదు: పవన్‌

‘భారత్‌ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌కు రావడంలో తప్పు లేదు. గతంలో తెరాస తెలంగాణవాదాన్ని వినిపించింది. దానిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చాక దేశమంతా పోటీ చేయాలని చూస్తున్నారు. ఏ పార్టీలోనైనా చేరికలు సహజం. కొత్తగా ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని