Chandrababu - Pawan Kalyan: పొత్తు దిశగానే అడుగులు!

వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా... తెదేపా, జనసేనల రాజకీయ అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం అక్టోబరులో, మళ్లీ ఆదివారం.. ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల భేటీలను దీనికి తొలి, మలి అడుగులుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated : 09 Jan 2023 07:13 IST

ఉమ్మడి పోరాటం దిశగా తెదేపా, జనసేన కార్యాచరణ
రాజకీయవర్గాల విశ్లేషణ

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా... తెదేపా, జనసేనల రాజకీయ అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం అక్టోబరులో, మళ్లీ ఆదివారం.. ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల భేటీలను దీనికి తొలి, మలి అడుగులుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వారిద్దరి భేటీలు చర్చలకే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో రెండు పార్టీలు చేపట్టే ఉమ్మడి కార్యక్రమాలతో మైత్రి సుస్థిరమవుతుందని, చివరకు పొత్తులు ఖరారవుతాయని అంచనా వేస్తున్నాయి. రెండు నెలల క్రితం ప్రధాని మోదీతో విశాఖలో పవన్‌ కల్యాణ్‌ భేటీ తర్వాత.. తెదేపా- జనసేన పొత్తుపై కొంత సందిగ్ధత ఏర్పడినా, రెండు పార్టీల అధినేతల తాజా కలయికతో స్పష్టత వచ్చినట్టేనని ఆ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య హైదరాబాద్‌లో ఆదివారం సమావేశం ఆత్మీయంగా జరిగిందని, అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తూ కలిసి నడవాలనే గట్టి సంకల్పం వారిలో వ్యక్తమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణతో పలు కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఇప్పటికే కింది స్థాయిలో అవగాహనతో పని చేస్తున్నారని, పొత్తుపై వారిలో సానుకూల ధోరణి ఉందన్న అంశం అధినేతల మధ్య చర్చకు వచ్చినట్లు ఆయావర్గాల సమాచారం. ఉదయం 11.30 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు వారి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.

వ్యతిరేక ఓటు చీలనీయకపోవడమంటే.. ఒకటే మార్గం

వైకాపా అరాచకాల్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కలవాలని పిలుపునిస్తున్న చంద్రబాబు.. రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటిస్తున్నారు. ఈ రెండింటికీ పొత్తు మినహా మరో మార్గం లేదన్నది రాజకీయ వర్గాల అంచనా. అందుకు అనుగుణంగానే.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామని ఆదివారం నాటి భేటీ తర్వాత ఇరుపార్టీల నేతలూ ప్రకటించారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో పొత్తులు సహజమన్న చంద్రబాబు, వాటిపై తర్వాత చర్చిస్తామని చెప్పారు. వైకాపాను సంయుక్తంగా, బలంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.

2 సార్లు భేటీ.. సంఘీభావానికే పరిమితం కాదు

వైకాపా అరాచక పాలన, పోలీసులతో అణచివేత చర్యలపై ఉమ్మడి పోరాటం దిశగా తెదేపా, జనసేన అడుగులు వేస్తున్నాయి. విశాఖ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌పై, కుప్పం పర్యటనలో చంద్రబాబుపై ప్రభుత్వ ఆంక్షలు, వేధింపుల నేపథ్యంలో.. ఇరువురు నేతలు పరస్పరం సంఘీభావం తెలుపుకొన్నారు. మొత్తంగా ఇరు పార్టీల అధినేతలు ఇటీవలే రెండు దఫాలుగా ఆంతరంగికంగా భేటీ అయ్యారు. ప్రతిపక్షాలను సంఘటితం చేసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని మొదటిసారి భేటీ తర్వాత వారిద్దరూ చెప్పారు. ఆదివారం సమావేశం తర్వాతా... భవిష్యత్తులో కలిసి పని చేస్తామని స్పష్టంచేశారు. అవసరాన్ని బట్టి రాజకీయ, ప్రజా, న్యాయ పోరాటాలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ అణచివేత చర్యలకు పాల్పడుతోందని, రాబోయే రోజుల్లో అవి మరింత పెరుగుతాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. వైకాపా అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై పోరాటంలో కలసి నడవాలని తెదేపా, జనసేన అధినేతలు ఇదివరకే నిర్ణయించుకున్నారు. దాన్ని మరింత పటిష్ఠం చేసి, ఉమ్మడి కార్యాచరణకు నడుం కట్టాలని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మరోసారి నిర్ణయానికి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని