అందుకే మా ఇళ్లపై తెదేపా జెండా: దేవినేని అవినాష్‌కు చేదు అనుభవం

‘పనిచేసినోళ్ల జెండాలనే మా ఇళ్లపై పెట్టుకుంటాం. అందుకే తెదేపా జెండా పెట్టుకున్నాం’ అంటూ విజయవాడలోని రాణిగారితోటకు చెందిన పలువురు మహిళలు వైకాపా నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 11 Jan 2023 09:31 IST

ఈనాడు, అమరావతి - కృష్ణలంక, న్యూస్‌టుడే: ‘పనిచేసినోళ్ల జెండాలనే మా ఇళ్లపై పెట్టుకుంటాం. అందుకే తెదేపా జెండా పెట్టుకున్నాం’ అంటూ విజయవాడలోని రాణిగారితోటకు చెందిన పలువురు మహిళలు వైకాపా నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వెనుక తిరిగాం. మీ కోసం పనిచేశాం. మాకు మీరేం చేశారు. మమ్మల్ని మోసం చేశారు’ అంటూ నిలదీశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

రాణిగారితోటలోని తారకరామానగర్‌లో వైకాపా నాయకులు పర్యటించారు. ఎస్కే రమీజా అనే మహిళ ఇంటివద్ద ఆగారు. ఆమె ఇంటిపై తెదేపా జెండాను చూస్తూ.. ‘ఇది మనం పెట్టిందేనా’ అని దేవినేని అవినాష్‌ అడిగారు. ‘ఔను! ఎందుకు పెట్టామో తెలుసా! మమ్మల్ని ఆయన మోసం చేశారు’ అంటూ కార్పొరేటర్‌ రామిరెడ్డిని చూపిస్తూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు గుడివాడలో తెదేపా తరఫున పోటీ చేసినప్పుడు ఆ జెండాను పెట్టాం’ అని మరో మహిళ చెప్పడంతో అవినాష్‌ మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ‘మీ వెంటే తిరిగాం.. అయినా మమ్మల్ని మోసం చేశారు’ అంటూ కార్పొరేటర్‌ను చూపిస్తూ మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని