BRS: మేం దిల్లీకి.. మోదీ ఇంటికి
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని, తాము దిల్లీకి వెళతామని భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కష్టాలు, కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారాస ఆవిర్భవించిందన్నారు.
2024 ఎన్నికల్లో జరిగేది అదే
భాజపాను గద్దె దించడానికి అందరూ ఏకంకావాలి
కష్టాలు, కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారాస ఆవిర్భావం
అయిదేళ్లలో దేశంలో ఇంటింటికీ రక్షిత నీరు.. సాగుకు ఉచిత విద్యుత్
25 లక్షల మందికి దళితబంధు
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్
ఖమ్మం నుంచి ఈనాడు ప్రతినిధి
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ దేశానికి లక్ష్యమంటూ లేకపోవడం సిగ్గుచేటు. లక్ష్యరహితంగా దేశం బిత్తరపోయి గత్తర పడుతోంది. మనది అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. ఇక్కడ లక్షల కోట్ల సంపద ఉంది. జలవనరులు, సాగుభూమి విషయంలో భారత్ అగ్రగామి. పాలన సరిగా ఉంటే అమెరికా కాళ్లు మొక్కనక్కర్లేదు. ఎవరినీ అడుక్కోవలసిన అవసరం లేదు. ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తీసుకునే దౌర్భాగ్యం పట్టదు
ముఖ్యమంత్రి కేసీఆర్
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని, తాము దిల్లీకి వెళతామని భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కష్టాలు, కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారాస ఆవిర్భవించిందన్నారు. ప్రజలు ఇన్నాళ్లూ మోసపోయారని, ఇక అది నడవదన్నారు. భాజపాను గద్దె దించడానికి అందరం ఏకం కావాలన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన భారాస ఆవిర్భావ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. భారాస అధికారంలోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో అయిదేళ్లలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తామని, దేశమంతటా రైతుబంధు అమలు చేస్తామన్నారు. రెండేళ్లలో దేశాన్ని వెలుగు జిలుగుల భారత్ చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి ఏటా 25 లక్షల మందికి సాయం అందిస్తామన్నారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సైన్యంలో అగ్నిపథ్‌ను రద్దు చేస్తామన్నారు. భాజపా విశాఖ ఉక్కును అమ్మితే తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ కొనుగోలు చేస్తామన్నారు.
దేశమంతా తెలంగాణ నమూనా
‘‘దేశం దుస్థితికి భాజపా, కాంగ్రెస్‌లే కారణం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే భాజపాను తిడుతుంది. భాజపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను విమర్శిస్తుంది. మంచినీళ్లు మాత్రం ఇవ్వడం చేతకాదు. దయచేసి దేశం ఆలోచించాలి. ఈ చైతన్యం తేవడానికి.. ప్రశ్నించడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే భారాస. తెలంగాణ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. పోరాటం చేయనిదే ముందుకు పోలేం. సర్వధర్మ సమభావన, సకల జనుల సంక్షేమం మా లక్ష్యం. భారాస ప్రతిపాదిత ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశాన్ని వెలుగు జిలుగుల భారత్ చేస్తాం. అన్నదాతలు తమ సమస్యల పరిష్కారానికి 13 నెలల పాటు ఎండావానల్లో ఉద్యమించారు. నిరర్థక ఆస్తుల పేరిట కేంద్రం తన అనుకూలురకు రూ. 16 లక్షలకోట్లు మాఫీ చేసింది. దేశంలోని రైతన్నకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రూ. 1.45 లక్షల కోట్లే చాలు. తెలంగాణ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తాం. అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతటికీ ఉచితవిద్యుత్ అందిస్తాం. రైతుబంధును అమలు చేస్తాం. దళితబంధు దేశమంతా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దళితజాతి బిడ్డలు అంబేడ్కర్, కాన్షీరాంల బాటలో ముందుకెళ్లాలి. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక మేం అమలు చేస్తాం. దేశంలో ఏటా 25 లక్షల మందికి దళితబంధు ఇస్తాం. ఎల్‌ఐసీని అడ్డికి పావుశేరుకు అమ్ముతారా? ఎల్‌ఐసీతో దేశానిది పేగుబంధం. దాని కోసం భారాస పోరాడుతుంది. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. దేశంలో ఇంకా లక్ష మెగావాట్ల జల విద్యుత్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానీయం. దానిని మోదీ అమ్మితే మేం అధికారంలోకి వచ్చాక కొంటాం. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. చట్టసభల్లో వారికి 35 శాతం రిజర్వేషన్ల కోసం ప్రతిపాదిస్తున్నాం. కేంద్రం అన్నింటినీ ప్రైవేటీకరిస్తోంది..మాది జాతీయీకరణ విధానం. ప్రభుత్వరంగ సంస్థలు వ్యాపారం చేయొద్దని మోదీ అంటున్నారు. అది తప్పు. కచ్చితంగా వ్యాపారం చేసి అభివృద్ధి చెందాల్సిందే. కరెంటును ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. మేం అధికారంలోకి వస్తే అయిదేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అందిస్తాం. పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం.
ఖమ్మం జిల్లాకు వరాలు
భారాస ఆవిర్భావ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు, నగర, పురపాలికలకు వరాలు ప్రకటించారు. ‘‘ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలున్నాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నాం. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి..ఇలా 10 వేల జనాభాకు మించి ఉన్న మేజర్ పంచాయతీలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నాను. ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు, మధిర, వైరా, సత్తుపల్లి నగరపాలికలకు రూ.30 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం.. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. మున్నేరు నదిపై పాత వంతెన స్థానంలో కొత్తదానిని నిర్మిస్తామన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులందరికీ నెలరోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఖమ్మం సభ ప్రబల మార్పునకు సంకేతం
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతలో మత విద్వేషం రేపుతోంది. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు భారాసను బలపరచాలి. కరెంటు కార్మికులు పిడికిలి బిగించాలి. ఖమ్మం సభ ప్రబలమైన మార్పునకు నిదర్శనం, ఖమ్మం చరిత్రలోనే అద్భుతమైన సభ ఇది. సభను విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు’’ అని సీఎం తెలిపారు.
భాజపాది ప్రైవేటీకరణ విధానమయితే మాది జాతీయీకరణ విధానం. త్వరలోనే భారాస విధానాలను ప్రజల ముందుంచుతాం. 150 మంది విశ్రాంత ఐఏఎస్‌లు, న్యాయమూర్తులు, మేధావులు వీటిని రూపొందిస్తున్నారు. కర్షకులు, కార్మికులు, సైనికులు, మహిళలు అందరూ ఏకమైతే మూర్ఖుల పాలన అంతమవుతుంది. మహోజ్వల భారతావని ఆవిష్కరిస్తుంది. అంతిమ విజయం మనదే’’
‘‘దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుతున్నాం. జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం, చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉండగా... భారత్‌లో అలాంటి అతిపెద్దదైన రిజర్వాయర్ ఒక్కటీ లేదు. మరి మన దేశానికి ఏమైంది? మనది సువిశాల దేశం.. 139 కోట్ల జనాభా.. కరవులు, కాటకాలు చూశాం. వరదలు చూస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా వద్దా మనకు? ఇప్పటికీ మంచినీళ్లకు బాధపడాలా? లొడలొడ మాట్లాడే ప్రధాని మోదీకి మంచినీళ్లు ఇవ్వడం చేతకాదా? ’’
‘‘భారత్ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటోది. రూ. లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? రాష్ట్రాల మధ్య నీటియుద్ధాలు జరుగుతున్నాయి. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోంది. ట్రైబ్యునళ్ల పేరిట కేంద్రం చోద్యం చూస్తోంది. చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లుగా దాని వైఖరి ఉంది. సరైన పరిపాలన వచ్చి.. నదుల నీళ్లు భూమ్మీదకు మళ్లి.. ప్రజల దాహం.. పొలాల దాహం తీర్చలేరా? దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ ఎప్పుడూ వాడడం లేదు. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు కేంద్రం సిగ్గుపడాలి’’
‘‘మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారింది. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్ పిజ్జాలు..బర్గర్లా? అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి, ఆహార శుద్ధి పరిశ్రమలతో కోటానుకోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడం కేంద్రానికి చేతకావడం లేదు’’
ఖమ్మం భారాస ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ