BRS: తొలి అడుగు భళా..!
ఖమ్మం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: తెరాస.. భారాసగా ఆవిర్భవించిన అనంతరం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు.
ఖమ్మం వేదికగా విపక్షాల ఐక్యత చాటిన కేసీఆర్
భారాస ఆవిర్భావ సభ విజయవంతం
రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై నేతల ప్రశంసలు, భాజపాపై విమర్శలు
ఖమ్మం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: తెరాస.. భారాసగా ఆవిర్భవించిన అనంతరం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. జాతీయ నాయకుల సమక్షంలో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంచి స్పందన లభించింది. సభకు సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఆప్ పార్టీలకు చెందిన అగ్రస్థాయి నాయకులను రప్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందడుగు వేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే వేదికపై నలుగురు సీఎంలు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఆసీనులవ్వడం సభకు ప్రధాన ఆకర్షణగా మారింది. భాజపాను బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు, సీఎంలను ఒకే వేదికపైకి చేర్చడం ద్వారా కేసీఆర్ విజయవంతమయ్యారు. కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ బహిరంగ సభ ద్వారా తొలి అడుగు పడినట్లయింది.
2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస గత 22 ఏళ్లలో క్రమంగా బలపడుతూ వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. కేసీఆర్ తన ప్రసంగంలో విపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వస్తే తామేం చేయబోతున్నామనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు భాజపాపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు తదితర సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలుచేస్తామన్న అంశాన్ని ప్రస్తావించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీటినే ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. రైతుబీమా, రైతుబంధు పథకాలను చెప్పడం ద్వారా దేశంలో అత్యధికంగా ఉన్న అన్నదాతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. బహిరంగసభ ప్రధాన వేదికపై జాతీయ నాయకుల చిత్రపటాలతో పాటు ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ (వచ్చేది రైతు ప్రభుత్వమే) అన్న నినాదంతో పాటు నాగలి ఎత్తిన రైతు, కాళేశ్వరం ప్రాజెక్టు చిత్రాలను ఉంచడం ఆకర్షించింది. ఈ నినాదాన్ని ఎక్కువమంది జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ముద్రించారు. మోదీ సర్కారుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కేసీఆర్... తాను అమలుచేస్తున్న పథకాల ద్వారా అన్నదాతల మద్దతు కూడగట్టి దేశవ్యాప్తంగా భారాసను విస్తరించే ప్రయత్నాలకు ఈ సభ నుంచి సంకేతాలిచ్చారు.
నేతల ప్రసంగాలకు భారీ స్పందన
నాయకులంతా బహిరంగసభ వేదికపైకి మధ్యాహ్నం 3.33కి చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ అత్యవసరంగా వెళ్లాల్సి రావడంతో.. సీఎం కేసీఆర్ తొలుత ఆయనను మాట్లాడాల్సిందిగా కోరారు. 20 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం విజయన్‌ను సత్కరించి వీడ్కోలు పలికారు. ఆయన హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లారు. తర్వాత యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ 14 నిమిషాలు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా 14 నిమిషాలు, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ 15 నిమిషాలు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 13 నిమిషాల పాటు ప్రసంగించారు. పంజాబ్ సీఎం ప్రసంగం కవితాత్మక ధోరణిలో సాగింది. ‘ఖమ్మం విప్లవ భూమి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. రాష్ట్రాల్లో గవర్నర్ల పెత్తనం మితిమీరుతోందని.. ప్రధాని మోదీ గవర్నర్లకు ఫోన్ చేసి సీఎంలను ఇబ్బంది పెట్టాలని సూచిస్తుంటారని.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి స్పందన లభించింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ప్రభుత్వాలను పడగొట్టడం, సీబీఐ, ఈడీ దాడులపై భాజపా ప్రధానంగా దృష్టి పెట్టిందని ఆయన విమర్శనాస్త్రాలు సంధించినప్పుడు చప్పట్లతో సభాప్రాంగణం మారుమోగింది. కేసీఆర్ ప్రసంగం సాయంత్రం 4.57 గంటలకు ప్రారంభమై.. ఆద్యంతం భాజపాపై విమర్శలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కొనసాగింది. ముందుగా ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపించి, తర్వాత జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమన్నారు. ఒకవేళ కేంద్రం చేసినా విపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తిరిగి జాతీయీకరణ చేస్తామని కేసీఆర్ వెల్లడించినప్పుడు సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి. కేసీఆర్ తన ప్రసంగాన్ని జై భారత్ నినాదంతో ముగించారు. అనంతరం జాతీయ నేతలను సత్కరించారు. వేదికపై ఇంకా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఆసీనులయ్యారు.
ఉదయం నుంచే కోలాహలం
బుధవారం ఉదయం 10 గంటల నుంచే సభాప్రాంగణంలో భారాస కార్యకర్తలు, శ్రేణుల కోలాహలం కనిపించింది. బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు.. టిప్పర్లలో సైతం తరలివచ్చారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వేషధారణలతో సభకు రావడం ఆకర్షణగా నిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకే సభ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఉమ్మడి ఖమ్మంతో పాటు పరిసర జిల్లాల ఎమ్మెల్యేలు జనసమీకరణలో కీలకంగా వ్యవహరించారు. సుమారు 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో మధ్యాహ్నానికే నిండిపోయాయి. దీంతో సుమారు 4 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించడంతో అక్కడి నుంచే ప్రజలు కాలినడకన వచ్చారు. భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నేతృత్వంలో నరసరావుపేట నుంచి ఖమ్మం వరకు 101 కార్లతో భారీ కాన్వాయ్ తరలివచ్చింది. సభాస్థలి మార్గంలో భారీ జనసందోహంతో చంద్రశేఖర్ వాహనశ్రేణి చిక్కుకుపోయింది. దీంతో ఆయన కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. ఏపీ భారాస నాయకులు ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 150 ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలు సభకు తరలివచ్చారు.
అన్నీ తానైన హరీశ్
సభ విజయవంతం కావడం వెనుక మంత్రి హరీశ్‌రావు చేసిన కృషిని సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సొంత జిల్లా కాకపోయినా జిల్లా మంత్రి, ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేశారని ప్రశంసించారు. బహిరంగసభ ఖమ్మంలో నిర్వహిస్తారని నిర్ణయించినప్పటి నుంచి హరీశ్ ఖమ్మంలోనే మకాం వేశారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని, బహిరంగ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
నామా, పువ్వాడలకు ఫోన్‌లో సీఎం అభినందనలు
ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ విజయవంతంగా నిర్వహించారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావులను అభినందించారు. తన అంచనాలకు అనుగుణంగా ప్రభంజనంలా జనం వచ్చారని, ఖమ్మం చరిత్ర సృష్టించిందని తెలిపారు. సభ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం కేసీఆర్.. పువ్వాడకు ఫోన్ చేశారు. జిల్లా నేతలంతా శ్రమించి, సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా సభను నిర్వహించారని ప్రశంసించారు. సభాప్రాంగణం కిక్కిరిసిందని, చాలామంది ఇంకా రోడ్ల మీదనే ఉండిపోయారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సభకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధులను కూడా ఫోన్‌లో అభినందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు పేరుపేరునా కేసీఆర్ అభినందనలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: విశ్రాంత ఐఏఎస్ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
-
India News
Amit Shah: బెంగాల్లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ