భాజపా మోసకారి పార్టీ

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేవలం కొద్ది మంది వ్యక్తులు, స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తూ దేశ ప్రజలందరినీ వంచిస్తోందని ఆరోపించింది.

Published : 22 Jan 2023 04:24 IST

అభియోగపత్రంలో కాంగ్రెస్‌ ధ్వజం
దిల్లీలో విడుదల చేసిన కాంగ్రెస్‌ నేతలు

దిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేవలం కొద్ది మంది వ్యక్తులు, స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తూ దేశ ప్రజలందరినీ వంచిస్తోందని ఆరోపించింది. భాజపాను అవినీతి, మోసకారి (భ్రష్ట్‌, జుమ్లా) పార్టీగా అభివర్ణించింది. ఈ మేరకు శనివారం దిల్లీలో అభియోగ పత్రాన్ని విడుదల చేసింది. ఒక పేజీ నిడివి ఉన్న అభియోగాలను మూడు విభాగాలుగా విభజించింది. మోదీ ప్రభుత్వ నినాదమైన ‘అందరితో కలిసి-అందరి అభివృద్ధి-అందరి విశ్వాసం-అందరి కృషి’ (సబ్‌కా సాత్‌-సబ్‌కా వికాస్‌-సబ్‌కా విశ్వాస్‌-సబ్‌కా ప్రయాస్‌)ను వ్యంగ్యంగా అనుకరిస్తూ...కొందరి లబ్ధి-స్వీయ ప్రయోజనాల కోసం-అందరినీ వంచించడం(కుచ్‌ కా సాత్‌- కుద్‌ కా వికాస్‌- సబ్‌కే సాత్‌ విశ్వాస్‌ఘాత్‌)ను అభియోగ పత్రంలో వివరించింది. తొలి విభాగంలో... కొద్ది మంది పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల రద్దు, పది శాతం మంది కుబేరుల చేతుల్లో 64 శాతం దేశ సంపద పోగుపడడంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను ప్రధాని మోదీ సన్నిహిత మిత్రులకు కట్టబెట్టారని ఆరోపించింది.రెండో విభాగంలో... ఆశ్రితపక్షపాతానికి పాల్పడడంతో పాటు ప్రచారం కోసం కోట్లాది రూపాయలను భాజపా ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తింది. మూడో విభాగంలో...నిరుద్యోగం, ఆహారభద్రత, మహిళల రక్షణ, రైతుల సమస్యలు, విద్వేష ప్రసంగాలు, రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడం వంటి అంశాలను పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని