డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రే

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రపై పొంతనలేని సమాచారం కోరుతూ డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Updated : 24 Jan 2023 20:00 IST

ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా పాదయాత్ర జరిగి తీరుతుంది
తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రపై పొంతనలేని సమాచారం కోరుతూ డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కాకముందే జే గ్యాంగ్‌లో వణుకు మొదలైందని ఆదివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘చీకటి జీవోపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండే సరికి డీజీపీని అడ్డుపెట్టి పాదయాత్రను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. డీజీపీ అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడగటం వైకాపా పతనానికి తొలి మెట్టులా కనిపిస్తోంది. ప్రభుత్వం, డీజీపీ ఇప్పటికైనా స్పందించి యువగళాన్ని అడ్డుకునే ప్రయత్నాలను ఆపాలి’ అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

డీజీపీ నిష్పక్షపాతంగా పని చేయాలి: మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

‘డీజీపీ నిష్పక్షపాతంగా పని చేయాలి. లోకేశ్‌ యువగళం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, వైకాపా నేతలు ఉలిక్కిపడుతున్నారు’

నాడు ఇలాగే చేస్తే పాదయాత్ర చేసే వారేనా: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

‘నాడు తెదేపా ప్రభుత్వం ఇవే ఆంక్షలు పెడితే జగన్‌ పాదయాత్ర చేసే వారేనా? గతంలో ఎప్పుడూ లేని ఆంక్షలు లోకేశ్‌ పాదయాత్రకే ఎందుకు పెడుతున్నారు. జగన్‌రెడ్డి మాటలు విని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే పోలీసులకు ఇబ్బందులు తప్పవు.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని