అనుమతిపై నిర్ణయం ఇంకెప్పుడు?
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్న ‘‘యువగళం’’ పాదయాత్రకు అనుమతులపై పోలీసుశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
లోకేశ్ పాదయాత్ర ప్రారంభానికి 3 రోజులే సమయం
ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తాత్సారం చేస్తున్నారంటున్న తెదేపా
అనుమతివ్వబోమని మేం చెప్పలేదు: చిత్తూరు ఎస్పీ
ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్- చిత్తూరు: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్న ‘‘యువగళం’’ పాదయాత్రకు అనుమతులపై పోలీసుశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ యాత్ర ప్రారంభానికి సమయం కేవలం మూడు రోజులే ఉన్నా పోలీసులు అనుమతి ఇవ్వకుండా తీవ్ర తాత్సారం చేస్తున్నారు. ఈ యాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసి 14 రోజులు గడుస్తోంది. ఇప్పటివరకూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం ప్రకటించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అనుమతులిస్తారా? లేదా? అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. యాత్రకు అనుమతి కోరుతూ ఈ నెల 9న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాసిన విషయం విదితమే. దానిపై పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారు? వారి వివరాలేమిటి? రాత్రుళ్లు ఎక్కడ బస చేస్తారు? వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు వంటి సమాచారం ఇవ్వాలంటూ సవాలక్ష యక్ష ప్రశ్నలతో రెండు రోజుల కిందట డీజీపీ ప్రత్యుత్తరమిచ్చారు. ఆ లేఖకు వర్ల రామయ్య వెంటనే సమాధానం పంపించారు. అయినా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఈ యాత్రకు అనుమతులపై పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చట్టప్రకారమే అనుమతులిస్తాం
- చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి
‘‘నారా లోకేశ్ పాదయాత్రకు చట్టప్రకారమే అనుమతిలిస్తాం. అనుమతివ్వబోమని మేం చెప్పలేదు. ఆంక్షలు విధించం. ఆపాలన్న ఉద్దేశం లేదు...’’ అని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ‘‘ఈ యాత్రకు అనుమతి కోరుతూ వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాయగా... దానిపై పలు వివరణలు కోరుతూ ఆయన సమాధానమిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ మనోహర్, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి కూడా యాత్రకు అనుమతి కోరుతూ మాకు దరఖాస్తు చేసుకున్నారు. రూట్ మ్యాప్ సహా ఇతర అంశాలపై నాలుగైదు రోజులుగా వారితో మాట్లాడుతున్నాం. వివరాలు అడుగుతున్నాం...’’ అని చెప్పారు.
నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఈ యాత్రకు అనుమతిచ్చారా? లేదా? అనే దానిపై మాత్రం రిషాంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వలేదు. మంగళవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని చిత్తూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతులు ఇస్తున్నట్లు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని మాజీ మంత్రి, తెదేపా నేత అమరనాథరెడ్డి వెల్లడించారు. పోలీసు శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను విజయవంతం చేస్తారని ఆయన చెప్పారు.
పదే పదే సవాలక్ష ప్రశ్నలు.. వాటిపై కొర్రీలు
‘‘యువగళం’’ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జిల్లా తెదేపా నాయకులు కూడా అనుమతి కోరుతూ స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత పోలీసులు అడిగిన మేరకు లోకేశ్ వాహన శ్రేణిలో ఉండే కార్ల సంఖ్య, వాటి డ్రైవర్ల వివరాలు అందించారు. అవి చాలవన్నట్లుగా మరికొన్ని ప్రశ్నలు సంధించారు. కమతమూరుకు వెళ్లే మార్గంలో నిర్వహించబోయే బహిరంగ సభకు ఎంత మంది హాజరవుతున్నారు? వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని అడిగారు. తెదేపా నాయకులు దానికీ సమాధానం పంపించారు. వారు అడిగిన సమాచారం అంతా ఇచ్చారు. అయినా సరే ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. తాత్సారం చేసేందుకు, ఇబ్బందులు పెట్టేందుకే సవాలక్ష వివరాలు అడుగుతున్నారని, వాటికి సమాధానమిస్తున్నా సరే కావాలనే పోలీసులు స్పందించడం లేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Civil Service: మోదీజీ.. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!
-
India News
NEET PG exam: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు వార్తల్ని నమ్మొద్దు: కేంద్రం
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్