ఆ రంగులేంటి... మోదీ బొమ్మ లేదేంటి?

‘ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశించినా వినరు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తూ ప్రధాని మోదీ ఫొటో పెట్టరు.

Updated : 24 Jan 2023 10:12 IST

కేంద్రం నిధులిస్తున్నా ప్రధాని చిత్రాలు లేకపోవడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం

‘ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశించినా వినరు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తూ ప్రధాని మోదీ ఫొటో పెట్టరు. కనీసం కేంద్ర ఆరోగ్యమిషన్‌ లోగోను కూడా భవనంపై ప్రదర్శించరు. ఇదేమి చోద్యం...’ అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ అధికారులపై మండిపడ్డారు. విజయవాడ భవానీపురం హెచ్‌బీ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోకి వస్తూనే భవనం రంగులను, సీఎం జగన్‌ ఫొటో మాత్రమే ఉండటాన్ని చూసి అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, నిర్వహణకు కేంద్రం నిధులిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ ఫొటోను, కేంద్ర ప్రభుత్వ చిహ్నాలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తాత్కాలికంగా అప్పటికప్పుడు బ్యానర్లు కట్టడం తగదన్నారు. ఇలాగైతే కేంద్ర బృందం విచారణ చేసి, నోటీసులు జారీ చేస్తుందని హెచ్చరించారు. ఆసుపత్రిలో బెడ్‌లు ఉన్నప్పటికీ సెలైన్‌ పెట్టే స్టాండ్లు లేకపోవడాన్ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వచ్చే గంట ముందు మాత్రమే వైద్య సిబ్బంది... వైద్యాధికారి గదిలో మోదీ చిత్రపటాన్ని పెట్టారు. బయట ఆయుష్మాన్‌ భారత్‌-హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ అని బ్యానర్‌ కట్టారు.

ఈనాడు, విజయవాడ, న్యూస్‌టుడే, భవానీపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు