కష్టపడితే అధికారంలోకి వస్తాం

రాష్ట్రంలో భాజపాను సంస్థాగతంగా పటిష్ఠం చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కమలదళం నిర్ణయించింది. శక్తి కేంద్రాల వారీగా కార్యాచరణ రూపొందించింది.

Updated : 25 Jan 2023 06:29 IST

బూత్‌ స్థాయి నుంచి పార్టీ పటిష్ఠం
11 వేల కూడలి సమావేశాలతో ప్రజల్లోకి
మూడు నెలలపాటు కార్యాచరణ
కార్యవర్గ భేటీలో భాజపా నేతల దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపాను సంస్థాగతంగా పటిష్ఠం చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కమలదళం నిర్ణయించింది. శక్తి కేంద్రాల వారీగా కార్యాచరణ రూపొందించింది. ఫిబ్రవరి నుంచి మూడు నెలల కార్యాచరణను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌లో మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డుసభ్యుడు కె.లక్ష్మణ్‌లు పార్టీ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు పార్టీకి ఉన్నాయని..కష్టపడి పనిచేయాలని వారు సూచించినట్లు సమాచారం. ‘తొలి మూడు నెలల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడం.. రెండో దశలో వివిధ వర్గాల ప్రజలను కలవడం, ప్రజాసమస్యలపై ఆందోళనలు చేపట్టడం... మూడో దశలో పెద్ద ర్యాలీలు, సభలు నిర్వహించడం.. జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలు చేపట్టడంపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు నుంచి అయిదు పోలింగ్‌ బూత్‌లను ఒక శక్తి కేంద్రంగా భాజపా పార్టీపరంగా గుర్తించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 11 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆ కేంద్రాల్లో 11 వేల కూడలి సమావేశాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటిని చిన్నపాటి సభలుగా నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని.. తద్వారా ప్రజల మద్దతును తమ వైపునకు కూడగట్టాలని భాజపా నేతలు నిర్ణయించారు.

విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

9, 10, 11, 12 తరగతుల విద్యార్థులతో ‘చాయ్‌ పే చర్చ’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. ఇది దేశవ్యాప్త కార్యక్రమం. పరీక్షల సమయంలో విద్యార్థులు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని వివరిస్తారని సమావేశంలో నేతలు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 5 పాఠశాలల్లో తెరలు ఏర్పాటుచేయాలని సూచించారు. 27న జరిగే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 900 మండలాల్లో కచ్చితంగా నిర్వహించాలని సూచించారు.

కేసీఆరేనా.. మనమూ రాజకీయాలు చేయాలి: బన్సల్‌

రాజకీయ ఎత్తుగడల్లో పార్టీ నేతలు దూకుడు పెంచాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం అంశంపై పార్టీ కార్యవర్గ సమావేశంలో పలువురు మాట్లాడిన సందర్భంగా బన్సల్‌ జోక్యం చేసుకున్నారు. ‘కేసీఆర్‌ రాజకీయాలు చేస్తారు. ఎత్తుగడలు వేస్తారని కొందరంటున్నారు. భాజపా ఓ మఠమో.. ధార్మిక సంస్థనో కాదు. కేసీఆరేనా రాజకీయాలు చేసేది? మనమూ రాజకీయమే చేయాలి. ఎత్తుగడలు వేయాలి’ అని బన్సల్‌ అన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ‘కొన్నిచోట్ల పార్టీ బలహీనంగా ఉందని కొందరు నాయకులు అంటున్నారు. అలాంటి సమాధానాలురావద్దు. నియోజకవర్గాల వారీగా పాలక్‌లు, ప్రభారీలు, కన్వీనర్లను పెట్టింది పార్టీని బలోపేతం చేయడం కోసమే కదా? పార్టీని నిర్మాణం చేయండి’ అని అన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర కార్యవర్గసమావేశంలో తరుణ్‌ఛుగ్‌, బన్సల్‌, సంజయ్‌ సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని