దిల్లీ మేయర్‌ ఎన్నిక మరోసారి వాయిదా

మేయర్‌ను ఎన్నుకోవడంలో దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ) మరోసారి విఫలమైంది. మంగళవారం ఎంసీడీ సమావేశమైనా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయకుండానే వాయిదాపడింది.

Published : 25 Jan 2023 03:25 IST

భాజపా, ఆప్‌ నేతల మధ్య తోపులాట.. నినాదాలు
సభలోనే బైఠాయింపు

దిల్లీ: మేయర్‌ను ఎన్నుకోవడంలో దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ) మరోసారి విఫలమైంది. మంగళవారం ఎంసీడీ సమావేశమైనా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయకుండానే వాయిదాపడింది. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. భాజపా-ఆప్‌ వాగ్వాదం మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు భాజపా కౌన్సిలర్‌, ప్రిసైడింగ్‌ అధికారి సత్యశర్మ ప్రకటించారు. ఎన్నిక చేపట్టడానికి వీలుగా భాజపా కౌన్సిలర్లు వెనక్కి రావాలని ఆమ్‌ ఆద్మీకి చెందిన కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డిమాండ్‌ చేస్తూ సభలోనే బైఠాయించారు. వారంతా వెనక్కి వచ్చేవరకు, ఎన్నిక జరిగేవరకు సభ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు. మేయర్‌ ఎన్నిక కోసం ఈ నెల 6న మొదటిసారి సమావేశం నిర్వహించినప్పుడు చోటు చేసుకున్న రభసను దృష్టిలో పెట్టుకుని ఈసారి అసాధారణ స్థాయిలో భద్రత కల్పించారు. సివిక్‌ సెంటర్‌ లోపల, బయట కూడా భద్రత సిబ్బందిని మోహరించారు.

నినాదాలు.. తోపులాట..

ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా సత్యశర్మ చేత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ముందుగా ప్రమాణం చేయించారు. ఈ విషయమై ఆప్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత నామినేటెడ్‌ సభ్యులు ‘జై శ్రీరాం.. భారత్‌ మాతా కీ జై..’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సత్యశర్మ కొందరు ఆప్‌ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎన్నికైనవారిని పక్కనపెట్టి నామినేటెడ్‌ సభ్యుల్ని ముందుగా ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ ఆప్‌ కౌన్సిలర్లు నినాదాలిచ్చారు. మేయర్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన వెంటనే భాజపా, ఆప్‌ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరుపార్టీలవారు వాగ్వాదానికి దిగారు. ఆప్‌ సభ్యులు నాలుగు గంటలకు పైగా ధర్నా నిర్వహించి రాత్రి 7.30కి విరమించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని