సంక్షిప్త వార్తలు (6)

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ‘యువగళం’ పాదయాత్ర చేపట్టడానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం నుంచి బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరతారు.

Updated : 25 Jan 2023 06:17 IST

లోకేశ్‌ పాదయాత్రకు మద్దతుగా బైక్‌ ర్యాలీ

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ‘యువగళం’ పాదయాత్ర చేపట్టడానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం నుంచి బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరతారు. తొలుత తన తాత ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ యువ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారని తెదేపా తెలిపింది. లోకేశ్‌ వెంట ఆయన స్వగృహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌, శంషాబాద్‌ వరకు బైక్‌ ర్యాలీ ఉంటుందని పేర్కొంది. ఎన్టీఆర్‌ ఘాట్‌కు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, కంభంపాటి రామ్మోహనరావు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం శోచనీయం: నిరంజన్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ సీఎం అయ్యాక జాతీయ పండుగల ప్రాధాన్యాన్ని క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేలాది మంది మధ్య ప్రతిష్ఠాత్మకంగా, హుందాగా వీటిని నిర్వహించుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. తర్వాత ఈ పండుగలను గోల్కొండ, పబ్లిక్‌ గార్డెన్‌లకు మార్చారన్నారు. ప్రస్తుతం గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం శోచనీయమన్నారు. ఇది జాతీయ పండుగను, ప్రజలను అవమానపరచడమేనని, ఇది స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.


రూట్‌మ్యాప్‌ పరిశీలించిన పోలీసులు

లోకేశ్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్‌ మంగళవారం పరిశీలించారు. స్థానిక కమతమూరు రోడ్డులోని బహిరంగ సభాస్థలిని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌బాబు, సీఐలు శ్రీధర్‌, మహ్మద్‌ రియాజ్‌ అహ్మద్‌, ఎస్సైలు శివకుమార్‌, లక్ష్మీరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. బహిరంగ సభ, పాదయాత్ర వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు.


బాలకృష్ణ కార్యక్రమానికి అనుమతిపై ఉత్కంఠ

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చిన్నమార్కెట్‌ కూడలిలో ఈ నెల 26న తాము ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టగా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొననున్నారు. దీనికి అనుమతి కోరుతూ స్థానిక తెదేపా నాయకులు మంగళవారం పోలీసులకు దరఖాస్తు చేశారు. అయితే వారేమీ తేల్చి చెప్పడంలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. తామేమీ సమావేశాలు నిర్వహించటం లేదని, నిరసన కార్యక్రమమే అని చెబుతున్నా పోలీసులు నోరు మెదపడం లేదని తెదేపా నాయకులు అంటున్నారు. కేసులు పెట్టినా సరే శాంతియుతంగా నిర్వహించి తీరుతామని వారు అన్నారు. అధికార పార్టీ నాయకులు ఎక్కడపడితే అక్కడ కార్యక్రమాలు చేపడితే బందోబస్తు కల్పిస్తున్నారని, తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ముందుగా దరఖాస్తు చేసుకొన్నా అనుమతి ఇవ్వకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.


విద్యార్థి, యువజన సంఘాల నేటి బస్సు యాత్రకు వామపక్షాల మద్దతు

ఈనాడు, అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధనకు విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం చేపట్టనున్న బస్సు యాత్రకు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. విజయవాడలోని దాసరి భవన్‌లో సమావేశమైన రెండు పార్టీల నాయకులు పలు అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావులతో పాటు నాయకులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్‌, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ బాబూరావులు పాల్గొన్నారు. రోడ్‌షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరిస్తూ అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఉత్తర్వు-1పై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 30న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహాగర్జనకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.


ఉద్యోగుల సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ప్రభుత్వం: సీపీఐ

ఈనాడు, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉద్యోగులు తమ సమస్యలను గవర్నర్‌కు విన్నవించుకున్నారని వెల్లడించారు. ఉద్యోగుల గోడు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, మంత్రులు పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలి? ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని