Andhra News: యువగళానికి షరతుల సంకెళ్లు

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు.

Updated : 25 Jan 2023 07:07 IST

ప్రజలతో మాటామంతీ బహిరంగ సభలా ఉండొద్దు
మైకులో మాట్లాడాలంటే డీఎస్పీ అనుమతి తీసుకోవాల్సిందే
రహదారులపై సభలకు వీల్లేదు
యాత్రలో పాల్గొనేవారి భద్రత బాధ్యత నిర్వాహకులదే
15 షరతులతో లోకేశ్‌ పాదయాత్రకు 3 రోజులు అనుమతిచ్చిన చిత్తూరు పోలీసులు
కుప్పం బహిరంగ సభకు 14 షరతులు

ఈనాడు, అమరావతి - ఈనాడు, డిజిటల్‌, చిత్తూరు: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. 15 షరతులు, నిబంధనలతో వీటిని జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్లు ఫిర్యాదులొచ్చినా, షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండానే అనుమతి రద్దు చేసేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27న ప్రారంభమయ్యే పాదయాత్ర 29 వరకూ కుప్పం నియోజకవర్గం పరిధిలో కొనసాగుతుందని పేర్కొంటూ... దానికి అనుమతి కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు పీఏ మనోహర్‌ చేసుకున్న దరఖాస్తుకు స్పందిస్తూ ఈ మేరకు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. 

27 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29 సాయంత్రం 5.55 గంటల వరకు మూడు రోజుల పాటే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పాదయాత్రకు పోలీసులు నిర్దేశించిన ఆంక్షలు, షరతులివే...

బహిరంగ సభలా మార్చకూడదు

* జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీ రహదారులపై బహిరంగ సభలు నిర్వహించొద్దు. అత్యవసర సేవలకు, నిత్యావసర సరకుల రవాణాకు ఆటంకం కలిగించకూడదు. బహిరంగ సభ నిర్వహించుకోవాలంటే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ వివరాలు పలమనేరు డీఎస్పీకి సమర్పించి అనుమతి పొందాలి.

పాదయాత్ర/రోడ్‌ షోను బహిరంగ సభలా మార్చకూడదు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో జరిపే మాటామంతి(ఇంటరాక్షన్‌) బహిరంగ సభ మాదిరిగా ఉండకూడదు. రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ అలాంటి ఇంటరాక్షన్‌ నిర్వహించినప్పుడు మైక్‌ వాడాలంటే డీఎస్పీ అనుమతి పొందాలి. ఈ కార్యక్రమాలను వీలైనంత వరకూ బహుళ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలున్న ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి. వీటిని బహిరంగ సభల మాదిరిగా నిర్వహించాలంటే మాత్రం అనుమతుల కోసం పలమనేరు డీఎస్పీకి దరఖాస్తు చేసుకోవాలి.

యాత్రలో డీజే సిస్టమ్స్‌, లౌడ్‌ స్పీకర్ల వినియోగం పూర్తి నిషేధం. సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టమ్‌ను తక్కువ శబ్దంతో వినియోగించాలి. పౌరజీవనానికి ఇబ్బంది కలిగించకూడదు.

జనాన్ని నియంత్రించే బాధ్యత వాలంటీర్లదే

* పురుష, మహిళా వాలంటీర్లను నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలి. భద్రతతో పాటు, సమూహ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణకు వీరిని వినియోగించాలి. వాలంటీర్లు అందరూ ఒకే తరహా యూనిఫాం ధరించాలి. వీరికి తగినన్ని తాళ్లు అందుబాటులో ఉంచాలి. పాదయాత్ర సజావుగా సాగేందుకు వీలుగా జనాన్ని నియంత్రించే బాధ్యత వీరిదే.

* పాదయాత్రలో మొత్తం రోడ్డును స్తంభింపజేయరాదు. సాధారణ ప్రజల కదలికలకు, ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం కలిగించకూడదు.

* టపాసులు కాల్చకూడదు. వీటి వినియోగం పూర్తిగా నిషిద్ధం. మద్యం, మత్తు పదార్థాలు వినియోగించకూడదు.

* ఫ్లయింగ్‌ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి చిత్రాలు తీయాలంటే డ్రోన్‌ నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

* పాదయాత్రలో పాల్గొనేవారెవరూ ప్రాణాంతక ఆయుధాలు, రాళ్లు వంటివి వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

* ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా, వాటి విధ్వంసం జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

* అనుమతించిన వాహనాలే పాదయాత్రలో ఉండాలి. అంతకంటే మించకుండా నిర్వాహకులు చూసుకోవాలి.

* షెడ్యూల్‌లో పేర్కొన్న రూట్‌, సమయాలకు కట్టుబడే పాదయాత్ర సాగాలి.

* యాత్రలో పాల్గొనే వారి వ్యక్తిగత భద్రత బాధ్యత నిర్వాహకులదే. అంబులెన్సుతో ప్రథమ చికిత్స, వైద్యపరికరాలు వంటివన్నీ నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి బసచేసే ప్రదేశాల్లో అవసరమైన లైట్లు, బారికేడింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

* ఈ షరతులన్నింటికీ నిర్వాహకులు కట్టుబడి ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా దానికి పూర్తి బాధ్యత వారిదే.

బహిరంగ సభకు 14 ఆంక్షలు

‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమయ్యే 27న కుప్పంలోని కమతమూరు రోడ్డులో నిర్వహించనున్న బహిరంగ సభకు అనుమతి కోరుతూ ఈ నెల 9 నుంచి ఇప్పటివరకూ ఆరుసార్లు తెదేపా అధినేత చంద్రబాబు పీఏ మనోహర్‌ పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. 14 రకాల ఆంక్షలతో మంగళవారం మధ్యాహ్నం అనుమతి ఇచ్చారు. బహిరంగ సభకు సంబంధించి షెడ్యూల్‌లో పేర్కొన్న నిర్దేశిత సమయాలకే కట్టుబడి ఉండాలని, వాటిలో తేడాలున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా... ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండానే అనుమతులు రద్దు చేస్తామని పేర్కొన్నారు.. బహిరంగ సభ నిర్వహణ సమయాన్ని మార్చదలిస్తే ముందస్తుగా పలమనేరు డీఎస్పీకి సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇతర షరతులివీ...

* సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, సున్నిత ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టకూడదు.

* సభకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తారో... అంతకంటే 20 శాతం మందికి అదనంగా ఏర్పాట్లు చేయాలి.

* బహిరంగ సభ నిర్వాహకులు ప్రసంగాలు సహా మొత్తం కార్యక్రమాన్ని, సభను వీడియో తీయాలి. వాటికి సంబంధించిన ఒక ప్రతిని పలమనేరు డీఎస్పీకి సమర్పించాలి.

* సభలో పాల్గొనే వారెవరూ ప్రాణాంతక ఆయుధాలు తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే. మద్యం, మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నిషేధం. టపాసులు కాల్చటానికి వీల్లేదు.

* ఫ్లయింగ్‌ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి చిత్రాలు తీయాలంటే డ్రోన్‌ నియమావళి పాటించాలి.

* తొక్కిసలాట జరగకుండా సభాస్థలిలో పటిష్ఠంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి. వీఐపీలు కూర్చునే వేదిక కూలకుండా చర్యలు తీసుకోవాలి. అధీకృత ఇంజినీర్‌ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. సభా స్థలానికి విద్యుత్తు శాఖ నుంచి కనెక్షన్‌ తీసుకోవాలి. వాహనాల పార్కింగ్‌కు సరిపడా స్థలాన్ని ఎంపిక చేసుకుని భూ యజమానుల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. అస్తవ్యస్తంగా పార్కింగ్‌ చేసి సాధారణ ప్రజానీకం రాకపోకలు, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల రవాణాకు ఆటంకం కలిగించకూడదు.

* సభ ముగిశాక ప్రజలంతా ఒకేసారి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.

* సభకు హాజరయ్యే ప్రజలకు ఓ పద్ధతి ప్రకారం నీళ్లు, భోజనం అందించాలన్నారు. అంబులెన్సు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు