సైనిక దళాలు సాక్ష్యాలు చూపనవసరం లేదు
మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రైక్స్)పై తమ పార్టీకి చెందిన సీనియర్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆక్షేపించారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
వాటితో ఏకీభవించడం లేదు: రాహుల్
ఝాజర్ కొట్లీ, జమ్మూ: మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రైక్స్)పై తమ పార్టీకి చెందిన సీనియర్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆక్షేపించారు. సాయుధ దళాలు తమ విధులను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాయని, ఎటువంటి సాక్ష్యాలు చూపనవసరం లేదని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా నుంచి పెద్ద ఎత్తున ఎదురైన ప్రశ్నలకు రాహుల్ మంగళవారం స్పందించారు. ఆయన వ్యాఖ్యలతో తాను కానీ, పార్టీ కానీ ఏకీభవించడంలేదని స్పష్టీకరించారు. ‘‘కొంతమంది మాటల మధ్యలో తింగరితనంతో మాట్లాడతారు. ఓ సీనియర్ నేత అలా వ్యాఖ్యనించడం సరికాదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఆయన అసంబద్ధంగా మాట్లాడారు. మన సైన్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆర్మీ ఏ చర్య చేపట్టినా దానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు ఇవ్వనక్కర్లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పేర్కొన్నదే పార్టీ అధికార విధానం. దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’’ అని రాహుల్ వివరించారు. దిగ్విజయ్‌పై ఏదైనా చర్య తీసుకుంటారా? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని, నియంతృత్వంలో లేదని బదులిచ్చారు.
సత్యం బయటకు వచ్చింది
‘‘నా ప్రతిష్ఠను వక్రీకరించేందుకు క్రమపద్ధతిలో భాజపా, ఆర్ఎస్ఎస్ వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. అయితే సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుంది’’ అని సోషల్ మీడియాలో ‘పప్పు’ అంటూ తననుద్దేశించి ఎగతాళిగా చిత్రీకరించడంపై రాహుల్ పేర్కొన్నారు. దేశంలో సత్యమే గెలుస్తుందని, డబ్బు కాదని భాజపాకు తెలిసొచ్చేలా కాంగ్రెస్ చేస్తుందన్నారు. భారత్ జోడో యాత్ర చివరి అంకంలో సాగుతోందని తెలిపారు. మంగళవారం తన పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన జమ్మూలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, భాజపా నేతలు డబ్బు, అధికారంతో ఏమైనా చేయొచ్చని భావిస్తుంటారని విమర్శించారు.
జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల మధ్య భాజపా చీలిక తెచ్చిందని రాహుల్ ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు ముందుగానే రాష్ట్ర హోదా కల్పించాలని, అలాగే ఇక్కడి శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై రాహుల్ స్పందిస్తూ.. ఏ విధమైన నిషేధాలు, అణచివేత, ప్రజలను భయపెట్టడం వంటి చర్యలు సత్యాన్ని బయటకు రాకుండా అడ్డుకోలేవు అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాను.. సైన్యాన్ని కాదు: దిగ్విజయ్
సొంత పార్టీ సహా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి తప్ప సైన్యానికి కాదని మంగళవారం ప్రకటించారు. ‘‘మన సాయుధ బలగాలపై నాకు అత్యంత గౌరవం ఉంది. నా ఇద్దరు సోదరీమణులు నౌకాదళ అధికారులను వివాహమాడారు. రక్షణ అధికారులను నిలదీశాననే ప్రశ్నే లేదు. నా ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సాక్ష్యాధారాలు చూపాలని, కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని సోమవారం దిగ్విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇంత సుదీర్ఘ కాలం పట్టిందెందుకు? : భాజపా
సైనిక దళాల పట్ల గౌరవాన్ని బహిరంగంగా ప్రకటించడానికి రాహుల్ గాంధీ ఇంత సుదీర్ఘ కాలాన్ని ఎందుకు తీసుకున్నారని భాజపా ప్రశ్నించింది. సైన్యంపై దిగ్విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ తోసిపుచ్చడాన్ని ఆక్షేపించింది. ఉగ్రవాదం, జాతీయ భద్రతపై తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం
-
Politics News
Andhra News: యువగళం.. వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామ
-
Crime News
Andhra News: అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు
-
General News
Arasavalli Temple: రథసప్తమి వేళ.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి