నోటీసులిచ్చి వెంటనే రమ్మంటే ఎలా?: ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ కోసం సీబీఐ నోటీసులపై స్పందించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా’ అని ప్రశ్నించారు.

Published : 25 Jan 2023 04:43 IST

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ కోసం సీబీఐ నోటీసులపై స్పందించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా’ అని ప్రశ్నించారు. అదే సమయంలో న్యాయం గెలవాలని అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగైదు రోజుల్లో విచారణకు హాజరవుతానని తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందునే మంగళవారం రాలేనని సీబీఐకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. సీబీఐ అధికారులు మళ్లీ నోటీసులిచ్చే అవకాశం ఉందన్న అవినాష్‌... తదుపరి నోటీసు తీసుకుని విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. తానేమిటో.. తన వ్యవహార శైలి ఏమిటో వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. న్యాయం గెలవాలి.. నిజం వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్న అవినాష్‌.. వివేకా కేసులో నిజం తేలాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు.. మరోసారి ఆలోచించాలని సూచించారు. దీనిపై మాట్లాడటమే ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్‌ అవుతాయో ఒకసారి ఊహించుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని