కొత్త నిబంధన ఒక్కటే

కుప్పం నుంచి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడించారు.

Published : 25 Jan 2023 04:43 IST

మిగతావన్నీ సాధారణంగా విధించేవే
పాదయాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పిస్తాం: ఎస్పీ రిషాంత్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: కుప్పం నుంచి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై మంగళవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. 29 ఆంక్షలు విధించి పాదయాత్రకు అనుమతులిచ్చినట్లు సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని, నిబంధనల్లో 15 పాదయాత్రకు, మరో 14 కుప్పం బహిరంగ సభకు సంబంధించినవని తెలిపారు. పాదయాత్రకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా వీటినే అనుసరించాలని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలు నిర్వహించకూడదన్న నిబంధన ఒక్కటే కొత్తదని తెలిపారు. మిగతావన్నీ సాధారణంగా విధించేవని, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే వీటిని అమలు చేస్తామని తెలిపారు. పాదయాత్ర వెంట పోలీసులు, రోప్‌ పార్టీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రెండు వరుసల కుప్పం- క్రిష్ణగిరి జాతీయ రహదారిలో ఒక వరుసను పాదయాత్రకు కేటాయిస్తామని తెలిపారు. పోలీసుశాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, నిర్వాహకులు కొంత బాధ్యత తీసుకుని, వాలంటీర్లను నియమించుకుంటే బాగుంటుందని సూచించామని వెల్లడించారు. పాదయాత్రలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్య సాయం అందుబాటులో ఉండాలని చెప్పామని వివరించారు. అభ్యంతరాలుంటే చర్చించవచ్చని, ఇంకా మినహాయింపులు కావాలంటే.. ఆమోదయోగ్యమైన వాటిని ఇస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని