పాదయాత్రకు భారీ ఏర్పాట్లు

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు సర్వం సిద్ధమవుతోంది.

Updated : 25 Jan 2023 05:32 IST

కుప్పంలో సిద్ధమవుతున్న బహిరంగ సభావేదిక, గ్యాలరీలు

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు సర్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులపాటు సాగనున్న పాదయాత్రను పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఘనంగా ప్రారంభించేందుకు శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కుప్పం బైపాస్‌ సమీపంలో కమతమూరు రహదారి పక్కన 10 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 200 మంది నేతలు ఆసీనులయ్యేలా వేదికను నిర్మిస్తున్నారు. భారీ సంఖ్యలో హాజరు కానున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం అవసరమైన గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.

పాదయాత్రకు మద్దతుగా హైదరాబాద్‌లో బైక్‌ ర్యాలీ

లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టడానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం నుంచి బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరతారు. తొలుత తన తాత ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ యువ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారని తెదేపా తెలిపింది. లోకేశ్‌ వెంట ఆయన స్వగృహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌, శంషాబాద్‌ వరకు బైక్‌ ర్యాలీ ఉంటుందని పేర్కొంది. ఎన్టీఆర్‌ ఘాట్‌కు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, కంభంపాటి రామ్మోహనరావు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఏపీలోని 175 నియోజకవర్గాల నుంచి నాయకులు, యువత హాజరవుతారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్య నేతలు కుప్పంలో ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ విజయవంతానికి సమావేశాలు.. సమీక్షల్ని  నిర్వహిస్తున్నారు. లోకేశ్‌తోపాటు రాష్ట్ర, జిల్లా నేతలు హాజరు కానున్న యువగళం బహిరంగ సభ ప్రాంగణంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం పట్టణంతోపాటు కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన కటౌట్లను, పట్టణంలోని ప్యాలెస్‌ రోడ్డులో చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను పెట్టారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు