అంబేడ్కర్‌తో జగన్‌కు పోలికా!

అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌ను అంబేడ్కర్‌తో పోల్చడం దారుణమైన, సిగ్గుపడాల్సిన విషయమని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 25 Jan 2023 04:43 IST

దళితుల అభ్యున్నతిపై అబద్ధాలు ప్రచారం చేస్తారా?
జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌ను అంబేడ్కర్‌తో పోల్చడం దారుణమైన, సిగ్గుపడాల్సిన విషయమని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైకాపా నాయకులే దళితులపై దాడులు చేస్తున్నారని, అలాంటి వారిని దళితులే కీర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రూ.49వేల కోట్లు ఏవీ..?

‘గత నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు రూ.49వేల కోట్లు కేటాయించినట్లు సామాజిక న్యాయ సలహాదారుడు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ని అంబేడ్కర్‌ కంటే... గొప్పవాడని అభివర్ణిస్తున్నారు. దళితులను అబద్ధాలతో మోసం చేస్తున్నారు. వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మా పార్టీపై ఉంది. 2019-2023 మధ్య  ఉపప్రణాళిక కేటాయింపులు రూ.49వేల కోట్లు. వీటిలో 35శాతం నిధులూ ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది. ఎస్సీ ఆర్థిక సంస్థకు నాలుగేళ్లలో రూ.25కోట్లు కేటాయించినట్లు ఉంది. ఇదేనా దళిత జనోద్ధరణ..? నారాయణస్వామి, సుచరిత, వనిత ఏంచేస్తున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక క్రీడా మైదానానికి రూ.4 కోట్ల ఎస్సీ నిధులు మళ్లించారని మండిపడ్డారు.‘అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం పేరును జగనన్న విద్యాపథకం అని మారిస్తే తప్పేంటి అని సలహాదారుడు అడుగుతున్నారు. 2013లో నాటి ప్రభుత్వం ఈ పథకానికి అంబేడ్కర్‌ పేరు పెడితే.. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రోత్సహించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు’ అని గుర్తు చేశారు.

ఎలా మేనమామ అయ్యారు?

దళితులకు సీఎం జగన్‌ ఎలా మేనమామ అయ్యారో చెప్పాలని శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ‘దళిత బిడ్డలను మీ కుటుంబం చేసుకుని దళితులకు మేనమామగా మారారా..? కళ్యాణమస్తు పథకం కింద 2019-21లో 2,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2020-23 కాలంలో ఒక్కరికీ ఇవ్వలేదు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద ఒక్కరికీ రుణం లేదు. చిన్న పరిశ్రమలకూ రుణాలు లేవు’ అని మండిపడ్డారు. 

ఈనాడు రాసింది అక్షర సత్యం..

‘ఈనాడు’లో రాసిన కథనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు దళిత బిడ్డలకు చెప్పాలని  శ్రవణ్‌కుమార్‌ హితవు పలికారు. ‘ఈనాడు కథనం అక్షర సత్యం. మీ అధికారులు ఇచ్చిన లెక్కలే. అన్ని జీవోలు, ఆధారాలు సహా రుజువు చేస్తా. రూ.10వేలు ఖాతాలో వేస్తే జీవన ప్రమాణాలు మారిపోతున్నాయా..? పౌరుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత లేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 1 నుంచి జైభీమ్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘దగా ప్రభుత్వం’ పేరుతో 175 నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని