ప్రాంతీయ పార్టీల పాలన నిరాశాజనకం

‘ఏపీలో అవినీతి పాలన కొనసాగుతోంది. అప్పట్లో చంద్రబాబు ప్రజలకేమీ చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌ ప్రజలకు చేసిందేమీ లేదు.

Published : 25 Jan 2023 04:43 IST

చంద్రబాబు అధికారంలో ఉండి  ఏం చేశారు?
వైకాపా పాలనలో ప్రజలు  మరింత నిరాశలో ఉన్నారు..
భాజపా రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ‘ఏపీలో అవినీతి పాలన కొనసాగుతోంది. అప్పట్లో చంద్రబాబు ప్రజలకేమీ చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌ ప్రజలకు చేసిందేమీ లేదు. వాళ్లను ఎన్నుకున్నందుకు ఏపీ ఓటర్లు ఓడిపోయారు’ అని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి, విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో మంగళవారం భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజలు మరింత నిరాశకు గురయ్యారు. తెదేపా, వైకాపాల పాలనకు ఎలాంటి తేడా లేదు. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం భాజపానే. భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం. వైకాపా పాలనపై ఛార్జిషీట్‌తో ప్రజల్లోకి రానున్నాం. జాతీయ ఎజెండాతో వస్తున్న భాజపాను ప్రజలు ఆదరించాలి. ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించేందుకు గవర్నర్‌ను కలిస్తే ప్రభుత్వం కక్ష కట్టడమేంటి?’ అని ప్రశ్నించారు. జీవో 1పై జగన్‌ సర్కారు వైఖరి సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ‘ఇదే జీవో గతంలో ఉంటే జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా? తిరుపతిలో గదుల అద్దె పెంపుపై చలో తిరుపతి నిర్వహిస్తాం. రేషన్‌ బియ్యం, ఉపాధి హామీ అవకతవకలు, సర్పంచుల సమస్యలపై భాజపా ఉద్యమిస్తుంది. ప్రజా పోరు రెండో విడతలో మార్చి 10-30 వరకూ 15 వేల కి.మీ.పాదయాత్ర చేపడుతున్నాం. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వేల ప్రాంతాల్లో లక్ష ప్రజా ఛార్జిషీట్లతో ప్రజల్లోకి వెళ్లనున్నాం. భాజపా పొత్తు రాష్ట్ర ప్రజలతోనే. సంక్షేమమంటే 9 పథకాలే కాదు’ అని ఆయన వివరించారు. తెదేపా, వైకాపా రెండు కుటుంబ, వారసత్వ పార్టీలే కాదు.. అవినీతి పార్టీలని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ‘రానున్న ఎన్నికల్లో తెదేపాతో పొత్తు ఉండదు. జనసేనతో పొత్తు యథాతథంగా కొనసాగుతుంది. వైకాపా, తెదేపాలు కుట్రపూరితంగా భాజపాను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మా నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరుకాలేకపోయారు’ అని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర భాజపా వ్యవహారాల సహఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, బిట్రా శివన్నారాయణ, భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్సీ మాధవ్‌, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, భాజపా నేతలు అంబికా కృష్ణ, పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

* వైకాపా అథోగతి పాలన, క్షీణిస్తున్న శాంతిభద్రతలు, కేంద్రం నిధులు సమకూరుస్తున్న పథకాలకు ముఖ్యమంత్రులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడాన్ని ఖండిస్తూ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వీర్రాజే..

వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగుతారని రాష్ట్ర భాజపా వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ సమావేశంలో ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర మంత్రులకు విన్నపమిచ్చేందుకు ఎమ్మార్పీఎస్‌ నేతలు సమావేశ స్థలికి వచ్చారు. లోపలకు అనుమతించాలంటూ నినదించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చి విన్నపాన్ని స్వీకరించారు.

ముఖ్య నేతల గైర్హాజరు

ఈనాడు, అమరావతి: ఈ సమావేశానికి ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీలు సుజనా చౌదరి,   టీజీ వెంకటేశ్‌ పాల్గొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని