Andhra news: విజయీభవ!

ఆత్మీయ ఆలింగనాలు... విజయీభవ అంటూ పెద్దల ఆశీర్వచనాలు... తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు బయల్దేరిన సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో బుధవారం గంభీర వాతావరణం నెలకొంది.

Updated : 26 Jan 2023 06:33 IST

లోకేశ్‌కు చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వచనం
తల్లిదండ్రులకు ప్రణమిల్లి పాదయాత్రకు పయనం
హారతిచ్చి... తిలకం దిద్దిన బ్రాహ్మణి

ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి, న్యూస్‌టుడే- జూబ్లీహిల్స్‌: ఆత్మీయ ఆలింగనాలు... విజయీభవ అంటూ పెద్దల ఆశీర్వచనాలు... తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు బయల్దేరిన సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో బుధవారం గంభీర వాతావరణం నెలకొంది. లోకేశ్‌ ఏడాదికి పైగా ఇంటికి దూరంగా ఉంటారన్న భావన ఆయన కుటుంబసభ్యుల్ని కొంత భావోద్వేగానికి గురిచేసింది. 400 రోజులు... 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు బయల్దేరుతున్న సందర్భంగా లోకశ్‌ను ఆశీర్వదించి, వీడ్కోలు పలికేందుకు మామ బాలకృష్ణ దంపతులతో పాటు, సన్నిహిత కుటుంబసభ్యులు ఆయన నివాసానికి వచ్చారు. లోకేశ్‌ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌లతో కలసి... కులదైవం వేంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరిలకు పాదాభివందనం చేశారు. అన్నివర్గాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని, ప్రజలకు అండగా నిలవాలని, పాదయాత్ర విజయవంతం కావాలని చంద్రబాబు, భువనేశ్వరి ఆకాంక్షించారు. లోకేశ్‌ను భువనేశ్వరి చెమర్చిన కళ్లతో గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు కూడా కుమారుడిని దగ్గరకు తీసుకుని, భుజం తట్టారు. అనంతరం లోకేశ్‌.... తన అత్తమామలైన బాలకృష్ణ, వసుంధర దంపతులకు, ఇతర పెద్దలకు పాదాభివందనం చేశారు. లోకేశ్‌కి బ్రాహ్మణి హారతిచ్చి, నుదుట తిలకం దిద్దారు. లోకేశ్‌ ప్రయాణించే వాహనానికి కొబ్బరికాయను దిష్టి తీశారు.

అభిమానుల కోలాహలం: లోకేశ్‌ పాదయాత్రకు బయల్దేరుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. తప్పెట మోతలు, టపాసుల పేలుళ్లు, జానపద నృత్యాలు, కోలాటాల సందడి మధ్య జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బైక్‌ ర్యాలీ మొదలైంది.మధ్యలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద టపాసులు కాల్చారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లోకేశ్‌ ఘనంగా నివాళులర్పించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, పార్టీ తెలంగాణ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు,  పార్టీ ఏపీ నాయకులు షరీఫ్‌, బుద్దా వెంకన్న, దామరచర్ల జనార్థన్‌, కేశినేని చిన్ని, జి.వి.రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని