సంక్షిప్త వార్తలు

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు మద్దతుగా గురువారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్రకు 53 మంది సమన్వయకర్తలను ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం నియమించారు.

Updated : 26 Jan 2023 06:24 IST

కాంగ్రెస్‌ పాదయాత్రకు 53 మంది సమన్వయ కర్తలు

ఈనాడు, అమరావతి: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు మద్దతుగా గురువారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్రకు 53 మంది సమన్వయకర్తలను ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం నియమించారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


28 పథకాలు రద్దు చేయడమేనా ఎస్సీ, ఎస్టీ సంక్షేమం?
తెదేపా హెచ్‌ఆర్డీ విభాగం ఛైర్మన్‌ రామాంజనేయులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై జగన్‌రెడ్డికి నిజంగా ప్రేమే ఉంటే తెదేపా హయాంలో ఆయా వర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా అమలు చేసిన 28 సంక్షేమ పథకాల్ని ఎలా రద్దు చేశారని తెదేపా హెచ్‌ఆర్డీ విభాగం ఛైర్మన్‌ బి.రామాంజనేయులు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్‌ప్లాన్‌ అమలుపై వైకాపాలోని ఎస్సీ, ఎస్టీ నేతలు, మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు యువత రాష్ట్ర కమిటీలోకి మరో 35 మంది

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలుగు యువత రాష్ట్ర కమిటీలో వివిధ జిల్లాల నుంచి అదనంగా 35 మంది సభ్యుల్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు ఉపాధ్యక్షులు, 12 మంది అధికార ప్రతినిధులు, పది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, పది మంది కార్యదర్శులు, ఒక మీడియా కోఆర్డినేటర్‌ను నియమించారు.


పోలీసు నియామకాల్లో తప్పిదాలపై గవర్నర్‌కు యువజన కాంగ్రెస్‌ ఫిర్యాదు
కోర్టు సూచన మేరకు 7 మార్కులు కలపాలి: శివసేనారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పోలీసు నియామకాల్లో జరిగిన తప్పిదాలపై గవర్నర్‌ తమిళిసైకి  ఫిర్యాదు చేసినట్లు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు నియామకాల్లో తప్పిదాలకు ఎంతోమంది అర్హులైన విద్యార్థులు నష్టపోయారన్నారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాస్‌ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు సూచించినా కలపడం లేదన్నారు. డ్రైవింగ్‌ కోసం చేసే నియామకాలకు కూడా రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో మనస్తాపానికి గురై ఇప్పటివరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెబితే గవర్నర్‌ చలించిపోయారన్నారు. వీటిపై నివేదికలు తెప్పించుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. హైకోర్టు సూచన మేరకు 7 మార్కులు కలపాలని కోరారు.


బలమైన ఉద్యమంతోనే పంచాయతీ వ్యవస్థ పరిరక్షణ
అఖిలపక్ష సమావేశంలో కోదండరాం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ దిశగా సర్పంచులు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై రాష్ట్ర సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యాన బుధవారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ సర్పంచులు ఎలా పనిచేయాలి.. తదితర అంశాలకు సంబంధించి అధికారాలను ఎమ్మెల్యేలకు ఇచ్చారని, పగ్గాలు వారి చేతుల్లో పెట్టుకుని సర్పంచులను పరుగెత్తమంటున్నారని విమర్శించారు. సర్పంచుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్టం తెచ్చారన్నారు.  తెలంగాణ, ఏపీలోనూ 14, 15వ ఆర్థిక సంఘం గ్రామాలకు ఇచ్చిన రూ.8,660 కోట్లు దారి మళ్లించారని, దానిపై ఏపీ భాజపా కేంద్రానికి ఫిర్యాదు చేస్తోందని అన్నారు. తెలంగాణ భాజపా సైతం అదే పని చేయాలని సూచించారు. భాజపా నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యను పార్టీలో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. వివిధ సంఘాలు, పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు.


ఏప్రిల్‌లోనే రాజధాని విశాఖకు: మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: ఈ ఏప్రిల్‌ నెలలోనే రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లిపోయే అవకాశం ఉందని, ఈ సమయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయాన్ని మార్చవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించినట్లు తెలిసింది. ఈ కమిషనరేట్‌ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉంది. దీన్ని విజయవాడ బస్‌స్టాండ్‌కు సమీపంలోని భవనంలోకి మార్చడానికి ఇటీవల అధికారులు మంత్రికి విన్నవించారు. ఏప్రిల్‌ నెలలోనే విశాఖకు వెళ్లిపోతామని, ఇప్పుడు కార్యాలయం మార్చడం ఎందుకంటూ ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో కార్యాలయ మార్పును అధికారులు విరమించుకున్నారు. విశాఖపట్నానికి వెళ్లే కార్యాలయాల్లో విద్యాశాఖే మొదట ఉంటుందని మంత్రి అన్నట్లు తెలిసింది.


లోకేశ్‌ పరువు నష్టం దావా విచారణకు అర్హమైనదే: విశాఖ కోర్టు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా వార్తలను ప్రచురించారని జగతి పబ్లికేషన్స్‌తోపాటు సంబంధిత వ్యక్తులపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దాఖలు చేసిన దావా పూర్తిస్థాయి విచారణకు అర్హమైనదేనని విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా జగతి పబ్లికేషన్స్‌ వార్తలను ప్రచురించడంతో నారా లోకేశ్‌ రూ.75 కోట్ల నష్టపరిహారం కోరుతూ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో దావా వేశారు.


సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే అనుమతులు: ఎస్పీ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలను అనుసరించే తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు అనుమతులు ఇచ్చామని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర, నిరసనలు, బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించినప్పుడు పాటించాల్సిన నిబంధనలన్నింటినీ భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నాయన్నారు. లోకేశ్‌ పాదయాత్రకూ వీటినే వర్తింపజేస్తున్నామన్నారు. 2017లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు అమలుచేసిన నిబంధనలే ఇప్పుడూ విధించామన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని